Pawan Kalyan: పవన్ కల్యాణ్‌వి తెలివితక్కువ మాటలు: జగదీశ్ రెడ్డి ఫైర్

Pawan Kalyan Remarks Criticized by Jagadish Reddy
  • కోనసీమకు తెలంగాణ నేతల దిష్టి తగిలిందన్న పవన్ కల్యాణ్
  • పవన్‌వి తెలివితక్కువ మాటలంటూ జగదీష్ రెడ్డి కౌంటర్
  • మా దిష్టి కాదు, ఏపీ వాళ్ల దిష్టే హైదరాబాద్‌కు తగిలిందన్న జగదీశ్
  • మెదడు వాడకుండా మాట్లాడేవాళ్లు డిప్యూటీ సీఎంలయ్యారంటూ విమర్శ
  • రెండు రాష్ట్రాల మధ్య రాజకీయ దుమారం రేపిన 'దిష్టి' వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చేసిన 'దిష్టి' వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల మధ్య రాజకీయ దుమారం రేపుతున్నాయి. కోనసీమ పచ్చదనానికి తెలంగాణ నేతల దిష్టి తగిలిందన్న పవన్ వ్యాఖ్యలపై తెలంగాణ మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పవన్‌వి తెలివితక్కువ మాటలని, మెదడుకు పనిచెప్పకుండా మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు.

"మా దిష్టి వాళ్లకు తగలడం కాదు, ఇన్నేళ్లుగా వాళ్ల దిష్టే మా తెలంగాణకు, హైదరాబాద్‌కు తగిలింది" అని జగదీశ్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ప్రతిరోజూ వందలాది మంది ఏపీ నుంచే హైదరాబాద్‌కు వస్తున్నారని, అలాంటప్పుడు తమ దిష్టి ఎలా తగులుతుందని ఆయన ప్రశ్నించారు. ఒకవేళ దిష్టి తగులుతుందని అంత భయంగా ఉంటే, ఓ దిష్టిబొమ్మ పెట్టుకోవాలని, దాన్ని తామేమీ ఆపలేదని వ్యంగ్యంగా అన్నారు. "ఇంత తెలివిలేని వాళ్లు కూడా ఉప ముఖ్యమంత్రులు అవుతున్నారంటే ఆశ్చర్యంగా ఉంది" అంటూ జగదీశ్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు.

బుధవారం కోనసీమ జిల్లా రాజోలులో 'పల్లె పండుగ 2.0' కార్యక్రమంలో పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, "పచ్చని కోనసీమకు తెలంగాణ నాయకుల దిష్టి తగిలింది. ఇక్కడి కొబ్బరి చెట్ల పచ్చదనాన్ని చూసే బహుశా వారికి ప్రత్యేక రాష్ట్రం ఆలోచన వచ్చిందేమో" అని వ్యాఖ్యానించారు. నరుడి దిష్టికి రాయి కూడా పగిలిపోతుందని ఆయన పేర్కొన్నారు.

పవన్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశం కాగా, జగదీశ్ రెడ్డి తాజా ప్రతిస్పందనతో రాజకీయ వేడి మరింత పెరిగింది. ఈ మాటల యుద్ధం రెండు రాష్ట్రాల మధ్య ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందోనని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
Pawan Kalyan
Andhra Pradesh
Telangana
Jagadish Reddy
Konaseema
AP Politics
Telangana Politics
Political Controversy
Drishti Comments
Palle Panduga 2.0

More Telugu News