Telangana Gramina Bank: నిజామాబాద్ గ్రామీణ బ్యాంకులో భారీ అగ్ని ప్రమాదం.. కీలక పత్రాల దగ్ధం

Telangana Gramina Bank Fire Accident in Nizamabad
  • మంటల్లో కాలి బూడిదైన 25 కంప్యూటర్లు, 7 ఏసీలు, విలువైన పత్రాలు
  • రెండు గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చిన అగ్నిమాపక సిబ్బంది
  • బ్యాంకు మేనేజర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ గ్రామీణ రీజనల్ బ్యాంకులో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. సుభాష్‌నగర్‌లోని బ్యాంకు బ్రాంచిలో బుధవారం రాత్రి జరిగిన ఈ ఘటనలో భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. సుమారు 25 కంప్యూటర్లు, 7 ఏసీలతో పాటు అనేక విలువైన పత్రాలు, ఫర్నిచర్ పూర్తిగా కాలి బూడిదయ్యాయి.

వివరాల్లోకి వెళితే... బుధవారం రాత్రి సమయంలో బ్యాంకు లోపలి నుంచి దట్టమైన పొగలు, మంటలు రావడాన్ని స్థానికులు గమనించారు. వెంటనే వారు పోలీసులకు, అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న నగర సీఐ శ్రీనివాస్ రాజు, మూడో పట్టణ ఎస్సై హరిబాబు తమ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది కూడా వెంటనే అక్కడికి చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నాలు ప్రారంభించారు.

అయితే, బ్యాంకు లోపల మంటల తీవ్రత ఎక్కువగా ఉండటంతో లోపలికి వెళ్లడం కష్టతరంగా మారింది. సుమారు రెండు గంటల పాటు శ్రమించిన తర్వాత అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ప్రమాద వార్త తెలియగానే బ్యాంకు అధికారులు, సిబ్బంది కూడా అక్కడికి చేరుకున్నారు. మంటలు ఆరిన తర్వాత లోపలికి వెళ్లి పరిశీలించగా, ఫర్నిచర్, ఎలక్ట్రానిక్ వస్తువులతో పాటు కీలకమైన డాక్యుమెంట్లు పూర్తిగా కాలిపోయినట్లు గుర్తించారు.

ఈ ఘటనపై బ్యాంకు మేనేజర్ వారణాసి రంజిత్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై హరిబాబు తెలిపారు. ప్రమాదానికి గల కచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదని, షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగిందా? లేక మరేదైనా కారణం ఉందా? అనే కోణంలో విచారణ జరుపుతున్నామని పోలీసులు వెల్లడించారు.
Telangana Gramina Bank
Nizamabad
Bank fire accident
Subhash Nagar
Fire accident
Regional bank
Computer burn
Important documents
Short circuit

More Telugu News