Shooting Near White House: అగ్రరాజ్యంలో కాల్పుల మోత.. వైట్‌హౌస్‌కు సమీపంలోనే సైనికులపై దాడి

Shooting Near White House Injures Two National Guard Members
  • వైట్‌హౌస్ సమీపంలో ఇద్దరు నేషనల్ గార్డ్ సభ్యులపై కాల్పులు
  • ఇద్దరు సైనికుల పరిస్థితి విషమం.. పోలీసుల అదుపులో నిందితుడు
  • ఇది లక్ష్యంగా చేసుకుని చేసిన దాడేనని అధికారుల అనుమానం
  • ఘటనపై తీవ్రంగా స్పందించిన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
వాషింగ్టన్‌లో కాల్పుల కలకలం రేగింది. అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌కు స‌మీపంలో బుధవారం జరిగిన కాల్పుల ఘటనలో ఇద్దరు వెస్ట్ వర్జీనియా నేషనల్ గార్డ్ సభ్యులు తీవ్రంగా గాయపడ్డారు. వారి పరిస్థితి విషమంగా ఉందని, ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నామని అధికారులు తెలిపారు. ఇది లక్ష్యంగా చేసుకుని జరిపిన దాడి అని వాషింగ్టన్ మేయర్ మురియల్ బౌజర్ పేర్కొన్నారు.

వివరాల్లోకి వెళితే... విధి నిర్వహణలో ఉన్న ఇద్దరు నేషనల్ గార్డ్ సభ్యుల వద్దకు వచ్చిన ఓ దుండగుడు అకస్మాత్తుగా తుపాకీతో కాల్పులు జరిపాడు. ప్రతిగా సైనికుల్లో ఒకరు ఎదురుకాల్పులు జరపడంతో నిందితుడు కూడా గాయపడ్డాడు. గాయపడిన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని గాయాలు ప్రాణాంతకం కాదని తెలుస్తోంది. ఈ దాడి వెనుక ఉద్దేశం ఏంటనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

దాడిపై తీవ్రంగా స్పందించిన ట్రంప్
ఈ దాడిపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందించారు. "సైనికులపై కాల్పులు జరిపిన నిందితుడికి తగిన మూల్యం తప్పదు. మన సైనికులకు, భద్రతా సిబ్బందికి దేవుడు అండగా ఉండాలి" అని ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సైనికుల కోసం ప్రార్థించాలని ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ప్రజలను కోరారు.

వాషింగ్టన్‌లో నేరాలను అదుపు చేసేందుకు ట్రంప్ ప్రభుత్వం ఆగస్టులో నేషనల్ గార్డ్‌ను మోహరించింది. అప్పటి నుంచి ఈ బలగాల మోహరింపుపై వివాదం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఈ దాడి జరగడం గమనార్హం.
Shooting Near White House
Washington DC
National Guard
Donald Trump
West Virginia National Guard
US President
Muriel Bowser
JD Vance
Crime control Washington
White House

More Telugu News