Jagan Mohan Reddy: చంద్రబాబుకు రైతుల ఉసురు తగులుతుంది: జగన్ తీవ్ర వ్యాఖ్యలు

Jagan Slams Chandrababu Government Over Farmer Distress
  • కూటమి పాలనలో ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదన్న జగన్
  • టన్ను రూ.30 వేలు పలికిన అరటి ఇప్పుడు రూ.2 వేలకే పరిమితమైందని ఆవేదన
  • 18 నెలల్లో రైతులకు ఒక్క రూపాయి ఇన్ పుట్ సబ్సిడీ ఇవ్వలేదని విమర్శ
ఆంధ్రప్రదేశ్‌లో రైతుల పరిస్థితి దారుణంగా తయారైందని, కూటమి ప్రభుత్వ పాలనలో ఏ పంటకూ గిట్టుబాటు ధర లభించడం లేదని వైసీపీ అధినేత జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా అరటి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. ఈరోజు తన నియోజకవర్గ పర్యటనలో భాగంగా పులివెందుల సమీపంలోని బ్రాహ్మణపల్లెలో అరటి తోటలను పరిశీలించి, రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా జగన్ మీడియాతో మాట్లాడుతూ.. తమ ప్రభుత్వ హయాంలో టన్ను అరటి ధర రూ.30 వేల వరకు పలికిందని గుర్తు చేశారు. అరటి ఎగుమతుల కోసం అనంతపురం-ఢిల్లీ, తాడిపత్రి-ముంబైకి ప్రత్యేక రైళ్లను కూడా నడిపామని, కానీ ఇప్పుడు టన్ను రూ.2 వేలకు కూడా కొనేవారు లేక పంట చెట్లపైనే మాగిపోతోందని విమర్శించారు. కూటమి ప్రభుత్వానికి రైతులపై ప్రేమ లేకపోవడం వల్లే ఈ దుస్థితి ఏర్పడిందన్నారు.

గత 18 నెలల కాలంలో రాష్ట్రంలో 16 సార్లు విపత్తులు సంభవించినా, రైతులకు ఒక్క రూపాయి కూడా ఇన్‌పుట్‌ సబ్సిడీ అందించలేదని జగన్ ఆరోపించారు. తమ హయాంలో సీజన్ ముగిసేలోపే పరిహారం అందించామని తెలిపారు. "వ్యవసాయం దండగ అని చంద్రబాబు నమ్ముతారు. అందుకే అన్నదాత సుఖీభవ హామీని నిలబెట్టుకోలేదు. రైతులు ఎరువులను సైతం బ్లాక్‌లో కొనుగోలు చేయాల్సిన పరిస్థితిని కల్పించారు" అని మండిపడ్డారు.

అరటి మాత్రమే కాకుండా మిర్చి, పసుపు, పొగాకు వంటి ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదని జగన్ పేర్కొన్నారు. చంద్రబాబుకు రైతుల ఉసురు తప్పకుండా తగులుతుందని, ఈ కూటమి ప్రభుత్వం త్వరలోనే బంగాళాఖాతంలో కలవడం ఖాయమని ఆయన హెచ్చరించారు. 
Jagan Mohan Reddy
Andhra Pradesh farmers
Banana farmers
AP crops price
TDP government
Chandrababu Naidu
YSRCP
Agriculture crisis AP
Pulivendula
Input subsidy

More Telugu News