Priyanka Vishwakarma: ప్రియురాలిని చంపి సూట్‌కేసులో కుక్కాడు.. పచ్చబొట్టుతో దొరికిపోయాడు!

Priyanka Vishwakarma Murder Case Solved in Thane
  • థానే జిల్లాలో వెలుగు చూసిన దారుణ ఘటన
  • చేతిపై ఉన్న పచ్చబొట్టు ఆధారంగా కేసును ఛేదించిన పోలీసులు
  • ఐదేళ్లుగా సహజీవనం చేస్తున్న జంట మధ్య గొడవే కారణం
  • నిందితుడిని అరెస్ట్ చేసి విచారిస్తున్న పోలీసులు
మహారాష్ట్రలోని థానే జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. తనతోపాటు సహజీవనం చేస్తున్న మహిళను ఓ వ్యక్తి అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని ఒక సూట్‌కేసులో కుక్కి సమీపంలోని కాలువలో పడేశాడు. ఈ కేసులో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.

థానే జిల్లా పరిధిలోని దేశాయ్ గ్రామ సమీపంలో ఉన్న కాలువ వంతెన కింద సోమవారం ఓ సూట్‌కేసును స్థానికులు గుర్తించారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని సూట్‌కేసును తెరిచి చూడగా, అందులో ఓ మహిళ మృతదేహం కనిపించింది. మృతురాలి మణికట్టుపై 'P V S' అనే అక్షరాలతో పచ్చబొట్టు ఉండటాన్ని పోలీసులు గుర్తించారు.

ఈ పచ్చబొట్టు, సోషల్ మీడియా, సమీపంలోని సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. మృతురాలిని ప్రియాంక విశ్వకర్మ (22)గా నిర్ధారించారు. ఆమెతో ఐదేళ్లుగా సహజీవనం చేస్తున్న వినోద్ శ్రీనివాస్ విశ్వకర్మ (50)పై అనుమానంతో అదుపులోకి తీసుకుని విచారించగా, అతడు నేరాన్ని అంగీకరించాడు.

నవంబర్ 21వ తేదీ రాత్రి తమ మధ్య గొడవ జరిగిందని, ఆ సమయంలో ప్రియాంకను గొంతు నులిమి హత్య చేసినట్లు నిందితుడు తెలిపాడు. ఒక రోజంతా మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచగా, దుర్వాసన రావడంతో నవంబర్ 22 రాత్రి సూట్‌కేసులో కుక్కి, కాలినడకన వెళ్లి వంతెనపై నుంచి కాలువలో పడేసినట్లు ఒప్పుకున్నాడు. నిందితుడిని మంగళవారం అరెస్ట్ చేసిన పోలీసులు.. హత్య, సాక్ష్యాలను నాశనం చేయడం వంటి అభియోగాలపై కేసు నమోదు చేశారు.
Priyanka Vishwakarma
Thane
Maharashtra
murder
live in partner
Vinod Vishwakarma
tattoo
crime
suitcase
Desai village

More Telugu News