: సంగీతంతో స్వస్థత.. ఆపరేషన్ ముందు మ్యూజిక్ వింటే తొందరగా కోలుకుంటారట!

  • ఢిల్లీలోని లోక్ నాయక్ ఆసుపత్రి, మౌలానా ఆజాద్ మెడికల్ కాలేజీ అధ్యయనంలో వెల్లడి
  • రోగికి ఆందోళనను, ఆపరేషన్ సమయంలో నొప్పిని తగ్గిస్తుందని పరిశోధకుల వివరణ
  • సుమారు ఏడాది పాటు 50 మంది రోగులపై ప్రయోగాత్మకంగా పరీక్షించిన వైద్యులు
శస్త్రచికిత్స సమయంలో సంగీతం వినిపించడం వల్ల రోగి తొందరగా కోలుకుంటారని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఆపరేషన్ సమయంలో ఇతరత్రా ప్రయోజనాలనూ గమనించామని ఈ అధ్యయనంలో పాల్గొన్న వైద్య బృందం పేర్కొంది. ఈమేరకు ఢిల్లీలోని లోక్ నాయక్ ఆసుపత్రి, మౌలానా ఆజాద్ మెడికల్ కాలేజీ సంయుక్తంగా నిర్వహించిన ఈ అధ్యయనంలో కీలక విషయాలు వెల్లడయ్యాయి.

 ఆపరేషన్ సమయంలో రోగికి సంగీతం వినిపించడం వల్ల మిగతా రోగులతో పోలిస్తే మత్తుమందు తక్కువ మోతాదు సరిపోయిందని వైద్యులు తెలిపారు. ఆపరేషన్ సమయంలో సాధారణంగా రోగులు ఆందోళనకు గురవుతారని చెప్పారు. అయితే, సంగీతం వినడం వల్ల ఈ ఆందోళన తగ్గడాన్ని కూడా గమనించినట్లు తెలిపారు. శారీరక నొప్పిని, ఆపరేషన్ తర్వాత కోలుకునే సమయాన్ని సంగీతం వినడం ద్వారా తగ్గించవచ్చని తమ పరిశోధనలో తేలిందన్నారు.
 
2023 మార్చి నుంచి 2024 జనవరి వరకు 50 మందికి పైగా రోగులపై ఈ అధ్యయనం నిర్వహించినట్లు లోక్ నాయక్ ఆసుపత్రి వైద్యుల బృందం తెలిపింది. ఇందులో పాల్గొన్న రోగుల్లో 18 సంవత్సరాల వయసు నుంచి 65 ఏళ్ల వయసున్న వారు ఉన్నారని వివరించింది. ఈ రోగులకు గాల్ బ్లాడర్ తొలగించేందుకు శస్త్రచికిత్స నిర్వహించామని, ఆపరేషన్ సమయంలోను, ఆ తర్వాత కూడా వారికి మంద్ర స్థాయిలో ఫ్లూట్ వాయిద్యంతో సంగీతం వినిపించామని తెలిపింది. 

ఆపరేషన్ థియేటర్ లో రోగికి సంగీతం వినిపించడం వల్ల మందుల మోతాదు తగ్గిందని, సాధారణంగా ఆపరేషన్ సమయంలో రోగికి ఇచ్చే మత్తుమందు, నొప్పిని, ఆందోళనను తగ్గించే మందుల మోతాదులో గణనీయమైన మార్పును గుర్తించామని పేర్కొంది. ఆపరేషన్ విజయవంతంగా పూర్తిచేశాక మిగతా వారితో పోలిస్తే సంగీతం వింటూ ఆపరేషన్ చేయించుకున్న వారు వేగంగా కోలుకున్నారని వైద్యులు తెలిపారు.

More Telugu News