UN Report: మహిళలకు కుటుంబమే నరకం.. ఐరాస నివేదికలో షాకింగ్ నిజాలు!

Womens Safety UN Report Reveals Disturbing Facts
  • కుటుంబ సభ్యుల చేతిలో రోజుకు 137 మంది మహిళల హత్య
  • ప్రతీ 10 నిమిషాలకు ఒకరు ప్రాణాలు కోల్పోతున్న వైనం
  • గతేడాది 50 వేల మందికి పైగా మహిళల హత్య
  • ఈ తరహా హత్యల్లో ఆఫ్రికా ఖండం అగ్రస్థానం
మహిళలకు అత్యంత సురక్షితమైన ప్రదేశంగా భావించే ఇల్లే వారికి నరకంగా మారుతోంది. కట్టుకున్న భర్త, తోడబుట్టిన వారు, ఇతర కుటుంబ సభ్యులే వారి పాలిట కాలయముళ్లలా మారుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతీ 10 నిమిషాలకు ఒక మహిళ తన కుటుంబ సభ్యులు లేదా జీవిత భాగస్వామి చేతిలో హత్యకు గురవుతోందని ఐక్యరాజ్యసమితి (ఐరాస) విడుదల చేసిన ఓ నివేదికలో దిగ్భ్రాంతికరమైన వాస్తవాలు వెలుగుచూశాయి.

ప్రపంచవ్యాప్తంగా 117 దేశాల్లో జరిగిన హత్యలను విశ్లేషించి ఐరాస ఈ నివేదికను రూపొందించింది. దీని ప్రకారం, గతేడాది ఏకంగా 50 వేల మందికి పైగా మహిళలు తమ కుటుంబ సభ్యుల చేతుల్లోనే ప్రాణాలు కోల్పోయారు. అంటే, సగటున రోజుకు 137 మంది మహిళలు హత్యకు గురవుతున్నారు. మహిళలపై జరుగుతున్న ఈ అఘాయిత్యాలు ఏ ఒక్క దేశానికో పరిమితం కాలేదని, ప్రపంచవ్యాప్తంగా ఈ ధోరణి ఆందోళనకరంగా ఉందని ఐరాస పేర్కొంది.

ఈ తరహా హత్యలు ఆఫ్రికా ఖండంలో అత్యధికంగా నమోదవుతున్నాయి. గత ఏడాది ఒక్క ఆఫ్రికాలోనే సుమారు 22 వేల మంది మహిళలు తమ కుటుంబ సభ్యుల చేతుల్లోనే హత్యకు గురయ్యారని నివేదిక వివరించింది.

మొత్తం మహిళల హత్యల్లో 60 శాతం ఘటనలు కుటుంబ సభ్యులు లేదా భాగస్వాముల చేతిలోనే జరుగుతుండటం గమనార్హం. అదే సమయంలో, పురుషుల హత్యల విషయంలో ఈ సంఖ్య కేవలం 11 శాతంగానే ఉంది. ఈ గణాంకాలు మహిళల భద్రత ఎంత ప్రమాదకర స్థితిలో ఉందో స్పష్టం చేస్తున్నాయి.
UN Report
Women
Domestic Violence
United Nations
Gender Based Violence
Femicide
Womens Safety
Africa
Global Crime Statistics

More Telugu News