Nara Lokesh: మంత్రి నారా లోకేశ్ 75వ రోజు ప్రజాదర్బార్... వెల్లువెత్తిన వినతులు

Nara Lokesh Conducts 75th Praja Darbar Receiving Public Grievances
  • నారా లోకేశ్ ప్రజాదర్బార్ కు విశేష స్పందన
  • రాష్ట్రం నలుమూలల నుంచి పెద్దఎత్తున తరలివచ్చిన ప్రజలు, కార్యకర్తలు
  • ప్రతి ఒక్కరి సమస్యను ఓపికగా విని, స్వయంగా అర్జీలు స్వీకరించిన లోకేశ్
  • వివిధ సమస్యల పరిష్కారానికి అక్కడికక్కడే సిబ్బందికి ఆదేశాలు జారీ
  • బాధితులకు అండగా ఉండి ఆదుకుంటామని హామీ ఇచ్చిన మంత్రి
రాష్ట్ర ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని, వాటి పరిష్కారానికి కృషి చేసే లక్ష్యంతో ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేశ్ నిర్వహిస్తున్న ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్విరామంగా కొనసాగుతోంది. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఆయన 75వ ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహించారు. 

ఈ కార్యక్రమానికి రాష్ట్రంలోని నలుమూలల నుంచి ప్రజలు, పార్టీ కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చి తమ గోడు వెళ్లబోసుకున్నారు. మంత్రి లోకేశ్ ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరించి, వారి సమస్యలను ఓపికగా విన్నారు. వారి నుంచి స్వయంగా వినతిపత్రాలు స్వీకరించి, అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. కొన్ని క్లిష్టమైన సమస్యల పరిష్కారానికి అక్కడికక్కడే తన సిబ్బందికి, సంబంధిత అధికారులకు తక్షణ ఆదేశాలు జారీ చేశారు.

లోకేశ్ దృష్టికి వచ్చిన పలు సమస్యలు

ప్రజాదర్బార్‌కు వచ్చిన వారిలో పలువురు తమ వ్యక్తిగత, సామూహిక సమస్యలను మంత్రి దృష్టికి తీసుకొచ్చారు.

* గత వైసీపీ ప్రభుత్వంలో టీడీపీ సానుభూతిపరుడిననే కక్షతో తనపై అక్రమ కేసులు బనాయించి, కుటుంబాన్ని తీవ్ర క్షోభకు గురిచేశారని శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లకు చెందిన జరుగుళ్ల గురుమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. కేసుల ఎత్తివేతకు చర్యలు తీసుకుని, ఆర్థికంగా ఆదుకోవాలని కోరారు.

* పీజీ పూర్తి చేసినా ఉద్యోగం లేక ఇబ్బంది పడుతున్నానని, ఉపాధి అవకాశం కల్పించాలని కర్నూలు జిల్లా గోవిందపల్లెకు చెందిన పగిడి వెంకటలక్ష్మి మంత్రిని అభ్యర్థించారు.

* గుంటూరు జిల్లా కురగల్లు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో 70 మంది సభ్యులు పొదుపు చేసిన రూ.7.55 కోట్ల నగదును సీఈవో దుర్వినియోగం చేశారని, దీనిపై విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని సంఘ సభ్యులు విన్నవించారు.

* మంగళగిరి నియోజకవర్గం పెద్దవడ్లపూడిలో తమ 0.39 ఎకరాల వ్యవసాయ భూమిని వెబ్‌ల్యాండ్‌లో నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలని కుర్రా వెంకట్రావు కోరారు.

* రాష్ట్రంలో రిటైర్డ్ పార్ట్‌టైమ్ ప్రభుత్వ ఉద్యోగులకు ప్రస్తుతం చెల్లిస్తున్న రూ.4 వేల పెన్షన్‌ను రూ.10 వేలకు పెంచాలని ఏపీ రిటైర్డ్ పార్ట్‌టైమ్ ఉద్యోగుల ఫెడరేషన్ ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు.

* అనారోగ్యంతో బాధపడుతున్న తమ కుమారుడి వైద్య చికిత్సకు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) ద్వారా ఆర్థిక సాయం అందించాలని విజయనగరం జిల్లాకు చెందిన వి.నాగభూషణం కోరారు.

* దివ్యాంగురాలైన తనకు జీవనోపాధి కోసం ట్రై-స్కూటీ అందజేయాలని పల్నాడు జిల్లా దాచేపల్లికి చెందిన షేక్ సుభాన్ బీ విన్నవించారు.

* పూర్తి అంగవైకల్యంతో బాధపడుతున్న తనకు రూ.15 వేల పెన్షన్ అందించి ఆదుకోవాలని అనంతపురం జిల్లా గుత్తికి చెందిన వై. మహాలక్ష్మి అభ్యర్థించారు.

ఈ విజ్ఞప్తులన్నింటినీ సావధానంగా పరిశీలించిన మంత్రి లోకేశ్, వాటిపై సానుకూలంగా స్పందించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా చూస్తామని, ప్రభుత్వపరంగా అన్ని విధాలా అండగా నిలుస్తామని వారికి హామీ ఇచ్చారు.
Nara Lokesh
Praja Darbar
Andhra Pradesh
TDP
Public Grievances
Guntur
Mangalagiri
YSRCP
Pension Scheme
Financial Assistance

More Telugu News