Bhumana Karunakar Reddy: సిట్ విచారణకు హాజరైన భూమన కరుణాకర్ రెడ్డి.. మీడియాతో ఆసక్తికర వ్యాఖ్యలు

Bhumana Karunakar Reddy Attends SIT Inquiry in TTD Theft Case
  • పరకామణి చోరీ కేసులో సిట్ విచారణకు హాజరైన భూమన
  • తనపై దుష్టచతుష్టయం కుట్ర పన్నుతోందని మండిపాటు
  • లోకేశ్, బీఆర్ నాయుడు ఒత్తిడి వల్లే విచారణకు పిలిచారని ఆరోపణ
టీటీడీ పరకామణి చోరీ కేసుకు సంబంధించి వైసీపీ సీనియర్ నేత, టీటీడీ మాజీ చైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి సిట్‌ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు. తిరుపతిలోని సిట్ కార్యాలయానికి వెళ్లే ముందు ఆయన మీడియాతో మాట్లాడుతూ, తనను ఈ కేసులో ఇరికించేందుకు కుట్ర జరుగుతోందని సంచలన ఆరోపణలు చేశారు.

ఈ సందర్భంగా భూమన మాట్లాడుతూ, "ఈ కేసుకు, నాకు... భూమికి, నక్షత్ర మండలానికి ఉన్నంత వ్యత్యాసం ఉంది. దుష్టచతుష్టయం నన్ను ఈ కేసులో ఇరికించాలని తీవ్రంగా ప్రయత్నిస్తోంది" అని వ్యాఖ్యానించారు. టీడీపీ నేతలు నారా లోకేశ్, వర్ల రామయ్య, పట్టాభి, టీటీడీ చైర్మన్‌ బీఆర్ నాయుడు తనను విచారించాలని అధికారులపై తీవ్ర ఒత్తిడి చేశారని ఆయన ఆరోపించారు. "ఆ ఒత్తిడి భరించలేకనే అధికారులు నన్ను విచారణకు పిలిచారు. అయినను పోయి రావలె హస్తినకు" అని అన్నారు.

కూటమి ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తోందంటూ మీడియాపై కూడా భూమన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. "కూటమి ప్రభుత్వాన్ని మోసే పిచ్చి శునకాలు అక్షరాల విరోచనాలతో తమ పత్రికలను నింపేశాయి" అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అనంతరం ఆయన సిట్ అధికారుల విచారణకు వెళ్లారు. ప్రస్తుతం ఈ కేసులో భూమన వాంగ్మూలాన్ని అధికారులు నమోదు చేస్తున్నారు.
Bhumana Karunakar Reddy
TTD
Parakamani theft case
SIT investigation
Nara Lokesh
BR Naidu
Varla Ramaiah
Pattabhi
TDP leaders
Andhra Pradesh Politics

More Telugu News