Telangana Police: డ్యూటీలో మతపరమైన దీక్షలు కుదరవు.. సెలవు తీసుకోవాల్సిందే: తెలంగాణ పోలీసు శాఖ కఠిన ఆదేశాలు

Telangana Police No Religious Deekshas on Duty Take Leave
  • విధి నిర్వహణలో దీక్షా వస్త్రాలు ధరించవద్దని ఆదేశం
  • నిబంధనలు ఉల్లంఘించిన కంచన్‌బాగ్‌ ఎస్సైకి మెమో
  • గడ్డం, జుట్టు పెంచడంపైనా నిషేధం
తెలంగాణ పోలీసు శాఖ తమ సిబ్బంది మతపరమైన దీక్షలు చేపట్టడంపై కీలక, కఠినమైన ఆదేశాలు జారీ చేసింది. అయ్యప్ప దీక్ష వంటి మతపరమైన దీక్షల్లో ఉన్నవారు విధి నిర్వహణకు హాజరుకాకూడదని, తప్పనిసరిగా సెలవు తీసుకోవాలని స్పష్టం చేసింది. ఈ నిబంధనలను ఉల్లంఘించి డ్యూటీలో దీక్షా వస్త్రాలతో కనిపించినందుకు సౌత్ ఈస్ట్ జోన్‌కు చెందిన కంచన్‌బాగ్‌ ఎస్సై కృష్ణకాంత్‌కు ఉన్నతాధికారులు మెమో జారీ చేశారు.

ప్రస్తుతం అయ్యప్ప దీక్షల సీజన్ కావడంతో కానిస్టేబుళ్ల నుంచి ఉన్నతాధికారుల వరకు చాలామంది సిబ్బంది మాల ధరించారు. ఈ నేపథ్యంలో పోలీసు శాఖ ఈ కొత్త మార్గదర్శకాలను విడుదల చేయడం చర్చనీయాంశంగా మారింది. విధి నిర్వహణలో ఉన్న పోలీసులు యూనిఫామ్ లేకుండా నల్ల దుస్తులు, నల్ల కండువాలు ధరించడం, షూస్ లేకుండా తిరగడం వంటివి చేయరాదని హెడ్ ఆఫీస్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. అలాగే, పోలీసులు విధుల్లో ఉన్నప్పుడు జుట్టు, గడ్డం పెంచుకోవద్దని కూడా ఉత్తర్వుల్లో పేర్కొంది.

అయితే, మతపరమైన దీక్షలను శాఖ వ్యతిరేకించడం లేదని, క్రమశిక్షణకే ప్రాధాన్యత ఇస్తున్నామని ఉన్నతాధికారులు చెబుతున్నారు. దీక్ష చేపట్టాలనుకునే వారు ముందస్తుగా అనుమతి తీసుకుంటే రెండు నెలల వరకు సెలవులు మంజూరు చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. దీక్షలో ఉంటూ విధులకు హాజరుకావడం మాత్రం నిబంధనలకు విరుద్ధమని తేల్చిచెప్పారు.
Telangana Police
Ayyappa Deeksha
Police Duty Rules
Religious Observances
Kanchabagh SI Krishna Kanth
Police Uniform
Leave Policy
Telangana Government
South East Zone

More Telugu News