BEL: ఇక భారత్‌లోనే హామర్ స్మార్ట్ బాంబుల తయారీ.. ఫ్రాన్స్‌తో బీఈఎల్ కీలక ఒప్పందం

India to Manufacture Rafale HAMMER Bombs with Safran BEL Partnership
  • ఫ్రాన్స్‌కు చెందిన సఫ్రాన్, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ జాయింట్ వెంచర్
  • 70 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగల స్మార్ట్ బాంబు
  • 60 శాతం విడిభాగాలు దేశీయంగానే ఉత్పత్తి చేసేలా ప్రణాళిక
భారత రక్షణ రంగం ఆత్మనిర్భరత దిశగా మరో కీలక ముందడుగు వేసింది. దేశంలోనే 'హామర్' (HAMMER) స్మార్ట్ బాంబులను తయారు చేసేందుకు ప్రభుత్వ రంగ సంస్థ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL), ఫ్రాన్స్‌కు చెందిన సఫ్రాన్ ఎలక్ట్రానిక్స్ & డిఫెన్స్ (Safran) మధ్య అధికారిక ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంపై బీఈఎల్ సీఎండీ మనోజ్ జైన్, సఫ్రాన్ ఈవీపీ అలెగ్జాండర్ జీగ్లర్ సంతకాలు చేశారు.

ఈ రెండు సంస్థలు కలిసి 50:50 వాటాలతో ఒక జాయింట్ వెంచర్ కంపెనీని (JVC) ఏర్పాటు చేయనున్నాయి. గతంలో 2025 ఫిబ్రవరిలో జరిగిన ఏరో ఇండియా ప్రదర్శన సందర్భంగా కుదిరిన అవగాహన ఒప్పందం (MoU) ఇప్పుడు కార్యరూపం దాల్చింది.

హామర్ అనేది ఫ్రాన్స్‌కు చెందిన అత్యంత అధునాతన ఎయిర్-టు-గ్రౌండ్ స్మార్ట్ బాంబు. రఫేల్ యుద్ధ విమానాల నుంచి ప్రయోగిస్తే ఇది 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న శత్రు బంకర్లు, కమాండ్ సెంటర్లు, రాడార్లను కచ్చితత్వంతో ధ్వంసం చేయగలదు. గగనతలంలో తన మార్గాన్ని మార్చుకోగల సామర్థ్యం, జామింగ్‌ను తట్టుకోగల శక్తి దీని సొంతం.

ఈ ఒప్పందం వల్ల 'మేకిన్ ఇండియా' కార్యక్రమానికి పెద్దపీట వేసినట్లయింది. తొలుత కొన్ని విడిభాగాలను ఫ్రాన్స్ నుంచి దిగుమతి చేసుకున్నా, దశలవారీగా 60 శాతం ఎలక్ట్రానిక్, మెకానికల్ భాగాలను దేశీయంగానే తయారు చేస్తారు. తయారీ, పరీక్ష, నాణ్యత నియంత్రణ బాధ్యతలను బీఈఎల్ చూసుకోనుంది. దీనివల్ల భారత వాయుసేన, నౌకాదళం అవసరాలకు విదేశాలపై ఆధారపడటం తగ్గుతుంది. అలాగే తేజస్ యుద్ధ విమానాల్లోనూ వీటిని అమర్చే అవకాశం ఉంటుంది. త్వరలోనే ఈ అత్యంత శక్తివంతమైన ఆయుధం భారత గడ్డపై తయారీ కానుంది.
BEL
Bharat Electronics Limited
Safran
HAMMER bombs
Rafale
India France defense
Make in India
defense agreement
air to ground missile
aerospace

More Telugu News