భారత్ పిచ్‌ల మీద విమర్శలు... ఘాటుగా స్పందించిన గవాస్కర్

  • భారత అంపైర్లు పొరపాటు చేస్తే చీటింగ్ అంటారన్న గవాస్కర్
  • అవతలి వారు చేస్తే మాత్రం మానవ తప్పిదమని అంటారని విమర్శ
  • మన పిచ్‌పై వికెట్లు ఎక్కువగా పడితే విమర్శలు చేస్తారని ఆగ్రహం
  • వారి పిచ్‌పై వికెట్లు పడితే మాత్రం స్పందించరని వ్యాఖ్య
ఉపఖండానికి చెందిన అంపైర్లు ఏదైనా పొరపాటు చేస్తే దానిని చీటింగ్ అంటారని, కానీ అవతలి వారు చేస్తే మాత్రం మానవ తప్పిదమని చెబుతుంటారని మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అన్నాడు. కోల్‌కతా పిచ్‌ను విమర్శిస్తున్న వారిపై ఆయన తీవ్రంగా స్పందించాడు. యాషెస్ సిరీస్‌లో భాగంగా ఇటీవల పెర్త్ వేదికగా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్ చాలా త్వరగా ముగిసింది.

ఈ క్రమంలో గవాస్కర్ స్పందిస్తూ, రెండు రోజుల్లో 32 వికెట్లు పడిపోతే స్పందించని విమర్శకులు ఈడెన్ గార్డెన్ వేదికగా దక్షిణాఫ్రికా, భారత జట్టు మధ్య మొదటి టెస్టు మ్యాచ్ మూడు రోజుల్లో ముగిస్తే మాత్రం విమర్శించడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశాడు. పెర్త్ టెస్ట్ మ్యాచ్ కనీసం రెండు రోజులు కూడా జరగలేదని అన్నాడు. మొత్తం 32 వికెట్లు పడ్డాయని, మొదటి రోజే 19 వికెట్లు పడ్డాయని గుర్తు చేశాడు. ఈ పిచ్‌లను మాత్రం విమర్శించడం లేదని అన్నాడు.

గత సంవత్సరం కూడా టీమిండియా, ఆస్ట్రేలియా పెర్త్ వేదికగా తలబడిన మ్యాచ్‌లోనూ ఒకే రోజులో బౌలర్లు 17 వికెట్లు తీశారని, అప్పుడు కూడా పిచ్ మీద ఎవరూ మాట్లాడలేదని ఆగ్రహం వ్యక్తం చేశాడు. సిడ్నీలోనూ ఒకేరోజు 15 వికెట్లు పడ్డాయని తెలిపాడు. అక్కడ బౌన్స్ ఉంది కాబట్టి వికెట్లు పడ్డాయని చెబుతారని, భారత్‌లో టర్న్ వికెట్‌పై మాత్రం వికెట్లు పోతే విమర్శలు చేయడమేమిటని వ్యాఖ్యానించాడు.

విదేశీ పిచ్ లపై మేం ఫిర్యాదు చేస్తే చాలు... ఫాస్ట్ బౌలింగ్ ఆడడం రాదని విమర్శలు చేస్తారు... భారత్‌లోని స్పిన్ పిచ్‌లపై వికెట్లు పడితే మాత్రం వారికి స్పిన్ బౌలింగ్ ఆడటం రాదని ఎందుకు అనడం లేదని ప్రశ్నించాడు. అలాగే వారి అంపైర్లు కూడా పొరపాటు నిర్ణయాలు తీసుకుంటే సహజంగా జరిగిన తప్పిదంగా చెబుతారని అన్నాడు. ఉపఖండం అంపైర్లు చేస్తే మాత్రం విమర్శలు చేస్తారని అన్నాడు. క్రికెట్ విమర్శకులు భారత్ వైపు వేలెత్తి చూపడం ఆపేయాలని అన్నాడు.


More Telugu News