PM Modi: ప్రధాని మోదీయే రాముడి అవతారం.. అయోధ్య శిల్పుల ప్రశంసలు

Sculptors of Ayodhyas Ram Temple call PM Modi an incarnation of Lord Ram ahead of flag hoisting ceremony
  • అయోధ్యలో ప్రధాని మోదీ పర్యటన.. ఆలయ శిఖరంపై ధ్వజారోహణ
  • మోదీని రాముడి అవతారంగా అభివర్ణించిన ఆలయ విగ్రహ శిల్పులు
  • రామమందిర ప్రాంగణంలోని సప్త మందిరాల్లో ప్రధాని ప్రత్యేక పూజలు
  • ధ్వజారోహణతో అధికారికంగా పూర్తికానున్న రామమందిర నిర్మాణం
రామమందిరంపై ధ్వజారోహణ కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అయోధ్యలో ప‌ర్య‌టిస్తున్నారు. ఆలయ నిర్మాణ పనుల పూర్తికి గుర్తుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రధానికి అయోధ్యలో ఘన స్వాగతం లభించింది. సాకేత్ కళాశాల హెలిప్యాడ్‌ వద్ద ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం ప్రధాని మోదీ భారీ రోడ్‌షోగా ఆలయానికి బయల్దేరారు.

రోడ్డుకు ఇరువైపులా పెద్ద సంఖ్యలో ప్రజలు, భక్తులు బారులు తీరి జైశ్రీరామ్, మోదీ-మోదీ నినాదాలతో హోరెత్తించారు. ప్రధాని కాన్వాయ్‌పై పూల వర్షం కురిపిస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ ఆలయ ప్రాంగణంలోని సప్త మందిరాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహర్షి వశిష్ఠ, విశ్వామిత్ర, అగస్త్య, వాల్మీకి, అహల్య, నిషాదరాజు, శబరిలకు అంకితం చేసిన ఈ ఆలయాలకు విశిష్ఠ ప్రాధాన్యం ఉంది.

మోదీని రాముడి అవతారంగా అభివర్ణించిన శిల్పులు
ఈ చారిత్రక ఘట్టంపై ఆలయ విగ్రహాలను చెక్కిన శిల్పులు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ప్రధాని మోదీని వారు రాముడి అవతారంగా అభివర్ణించారు. ఆలయం కోసం దాదాపు 30 విగ్రహాలను రూపొందించిన శిల్పి ప్రశాంత్ పాండే మాట్లాడుతూ.. "సనాతన ధర్మానికి, దేశాభివృద్ధికి ఆయన చేస్తున్న సేవ అమోఘం. మా దృష్టిలో ఆయన రాముడి అవతారం. ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటాం" అని అన్నారు.

విగ్రహాలు చెక్కుతున్నప్పుడు ఎన్నో దైవిక అనుభూతులు కలిగాయని మరో శిల్పి సత్యనారాయణ్ పాండే తెలిపారు. ఒకే శిల నుంచి రాముడు నీలివర్ణంలో, సీతాదేవి తేజోవంతమైన రూపంలో ఆవిర్భవించడం దైవలీల అని ఆయన పేర్కొన్నారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో ప్రధాని మోదీ ఆలయ శిఖరంపై పతాకావిష్కరణ చేస్తారు. ఈ కార్యక్రమంతో రామమందిర నిర్మాణం అధికారికంగా పూర్తవుతుంది.
PM Modi
Ayodhya
Ram Mandir
Ram Temple
Yogi Adityanath
Hindu Temple
Indian Politics
Sanatana Dharma
Prashant Pandey
Ram Lalla

More Telugu News