Software Engineer: లైంగిక సమస్యకు మందని నమ్మి.. రూ.48 లక్షలు పోగొట్టుకున్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్

Software Engineer Loses 48 Lakhs in Sexual Problem Cure Scam
  • ఆయుర్వేద వైద్యం పేరుతో టెక్కీని మోసం చేసిన నకిలీ బాబా
  • 'దేవరాజ్ బూటీ' పేరుతో లక్షల్లో దోచుకున్నవైనం
  • డబ్బు పోవడమే కాకుండా కిడ్నీ సమస్యలు కొనితెచ్చుకున్న బాధితుడు
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్
బెంగళూరులో ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ దారుణంగా మోసపోయాడు. లైంగిక సమస్యను నయం చేస్తానని నమ్మించిన ఓ నకిలీ ఆయుర్వేద వైద్యుడి చేతిలో ఏకంగా రూ.48 లక్షలు పోగొట్టుకున్నాడు. డబ్బు పోవడమే కాకుండా, ఆ నకిలీ మందుల కారణంగా కిడ్నీ సంబంధిత సమస్యలను కూడా కొనితెచ్చుకున్నాడు. చివరకు మోసపోయానని గ్రహించిన బాధితుడు శనివారం జ్ఞానభారతి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

పోలీసుల కథనం ప్రకారం.. 2023లో వివాహం తర్వాత బాధితుడికి లైంగిక ఆరోగ్య సమస్య తలెత్తింది. మొదట ఓ మల్టీ-స్పెషాలిటీ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నా ఫలితం లేకపోయింది. ఈ క్రమంలో మే 3న కేఎల్‌ఈ లా కాలేజీ సమీపంలో రోడ్డు పక్కన వేసిన ఓ 'ఆయుర్వేదిక్ దవాఖానా' గుడారం అతడి కంటపడింది. అందులో 'విజయ్ గురూజీ'గా పరిచయం చేసుకున్న వ్యక్తి, తన దగ్గరున్న అరుదైన మందులతో సమస్యను శాశ్వతంగా నయం చేస్తానని నమ్మబలికాడు.

హరిద్వార్ నుంచి ప్రత్యేకంగా తెప్పించిన 'దేవరాజ్ బూటీ' అనే మందు కొనాలని సూచించాడు. గ్రాముకు రూ.1.6 లక్షలు ఉంటుందని, యశ్వంత్‌పూర్‌లోని ఓ ఆయుర్వేద స్టోర్‌లో ఇది దొరుకుతుందని చెప్పాడు. మందు కొనేటప్పుడు ఒంటరిగా రావాలని, డబ్బులు కూడా నగదు రూపంలోనే చెల్లించాలని షరతులు పెట్టాడు. అతని మాటలు నమ్మిన టెక్కీ ఆ మందును కొన్నాడు.

ఆ తర్వాత 'భావనా బూటీ తైలం' పేరుతో మరో మందును గ్రాముకు రూ.76,000 చొప్పున అంటగట్టాడు. చికిత్స మధ్యలో ఆపితే వికటిస్తుందని బెదిరించడంతో, బాధితుడు భార్య, తల్లిదండ్రుల నుంచి రూ.17 లక్షలు, బ్యాంకు నుంచి రూ.20 లక్షల లోన్ తీసుకుని మరీ డబ్బు చెల్లించాడు. ఇలా మొత్తం రూ.48 లక్షలు సమర్పించుకున్నా, అతని సమస్య ఏమాత్రం తగ్గకపోగా కొత్తగా కిడ్నీ సమస్యలు మొదలయ్యాయి.

ఈ ఘటనపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతోంది. "రూ.48 లక్షలు ఖర్చు చేశాడా! అతను మోసపోవడానికి అర్హుడే" అంటూ ఓ ప్రముఖ కార్డియాలజిస్ట్ వ్యాఖ్యానించగా, చదువుకున్న వారు కూడా ఇలాంటి మోసాల బారిన పడటంపై చాలామంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 
Software Engineer
Bengaluru
Sexual Health
Ayurvedic Medicine
Fraud
Kidney Problems
Vijay Guruji
Haridwar
Devraj Booti
Bhavana Booti Tailam

More Telugu News