కొత్త కార్మిక చట్టాలతో 77 లక్షల ఉద్యోగాలు.. ఆర్థిక వ్యవస్థకు బూస్ట్: ఎస్‌బీఐ నివేదిక

  • దేశంలో 1.3 శాతం వరకు నిరుద్యోగం తగ్గే అవకాశం ఉంద‌న్న‌ నివేదిక
  • వినియోగం రూ.75,000 కోట్ల మేర పెరిగే సూచనలు
  • సంఘటిత రంగ కార్మికుల వాటా 75.5 శాతానికి పెరుగుతుందని అంచనా
దేశంలో కొత్తగా అమలులోకి వచ్చిన కార్మిక చట్టాలు నిరుద్యోగ సమస్యకు పరిష్కారం చూపే అవకాశం ఉందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) రీసెర్చ్ నివేదిక వెల్లడించింది. ఈ చట్టాల అమలుతో నిరుద్యోగం 1.3 శాతం వరకు తగ్గి, దాదాపు 77 లక్షల కొత్త ఉద్యోగాలు వస్తాయని తాజాగా విడుదల చేసిన నివేదికలో అంచనా వేసింది.

ఈ ఉపాధి కల్పనతో పాటు వినియోగం కూడా భారీగా పెరగనుందని ఎస్‌బీఐ గ్రూప్ చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ డాక్టర్ సౌమ్య కాంతి ఘోష్  తెలిపారు. "ఒక్కో వ్యక్తి రోజువారీ వినియోగం రూ.66 పెరిగి, దేశవ్యాప్తంగా వినియోగ వ్యయం సుమారు రూ.75,000 కోట్లకు చేరుకుంటుంది. ఇది వినియోగానికి పెద్ద ఊపునిస్తుంది" అని ఆయన వివరించారు.

ప్రస్తుతం దేశంలో 44 కోట్ల మంది అసంఘటిత రంగంలో పనిచేస్తుండగా, వీరిలో 31 కోట్ల మంది ఈ-శ్రమ్ పోర్టల్‌లో నమోదయ్యారు. కొత్త చట్టాల వల్ల వీరిలో కనీసం 20 శాతం మంది, అంటే దాదాపు 10 కోట్ల మంది సంఘటిత రంగంలోకి మారతారని నివేదిక అంచనా వేసింది. దీంతో దేశంలో సంఘటిత రంగ కార్మికుల వాటా 60.4 శాతం నుంచి 75.5 శాతానికి పెరుగుతుందని పేర్కొంది. రాబోయే 2-3 ఏళ్లలో సామాజిక భద్రత పరిధి 80-85 శాతానికి చేరుకోవచ్చని తెలిపింది.

కేంద్ర ప్రభుత్వం 2019, 2020 సంవత్సరాల్లో పార్లమెంటులో ఆమోదించిన నాలుగు కార్మిక కోడ్‌లను ఈ నెల‌ 21 నుంచి అమలులోకి తెచ్చిన విషయం తెలిసిందే. ఈ సంస్కరణలు కార్మికులు, యాజమాన్యాలు ఇద్దరికీ సాధికారత కల్పిస్తాయని, తద్వారా దేశం మరింత పోటీతత్వంతో స్వావలంబన దిశగా పయనిస్తుందని నివేదిక అభిప్రాయపడింది.


More Telugu News