Lakshmi Mittal: బ్రిటన్ ను వీడిన ప్రపంచ కుబేరుడు... కారణం ఇదే!

Lakshmi Mittal Leaves UK Citing Tax Changes
  • బ్రిటన్‌కు వీడ్కోలు పలికిన ఉక్కు దిగ్గజం లక్ష్మీ మిట్టల్
  • 30 ఏళ్ల తర్వాత స్విట్జర్లాండ్‌కు మారిన నివాసం
  • బ్రిటన్‌లో 8వ అత్యంత ధనవంతుడిగా గుర్తింపు పొందిన మిట్టల్
భారత సంతతికి చెందిన ఉక్కు దిగ్గజం, బిలియనీర్ లక్ష్మీ నివాస్ మిట్టల్ దాదాపు మూడు దశాబ్దాల తర్వాత బ్రిటన్‌కు వీడ్కోలు పలికారు. 1995 నుంచి లండన్‌లో నివసిస్తున్న ఆయన తన నివాసాన్ని స్విట్జర్లాండ్‌కు మార్చారు. యూకే ప్రభుత్వం వారసత్వ పన్ను విధానంలో తీసుకురానున్న మార్పులే ఈ నిర్ణయానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది.

'సండే టైమ్స్ రిచ్ లిస్ట్' 2025 ప్రకారం లక్ష్మీ మిట్టల్ సంపద విలువ 15.4 బిలియన్ పౌండ్లు. ఈ సంపదతో ఆయన యూకేలో 8వ అత్యంత ధనవంతుడిగా నిలిచారు. ప్రస్తుతం స్విట్జర్లాండ్‌లో నివసిస్తున్న ఆయన భవిష్యత్తులో దుబాయ్‌లో స్థిరపడే అవకాశాలున్నాయని సమాచారం. ఆయనకు ఇప్పటికే దుబాయ్‌తో పాటు ఐరోపా, అమెరికాలో కూడా ఆస్తులున్నాయి.

రాజస్థాన్‌లో జన్మించిన లక్ష్మీ మిట్టల్, ఉక్కు పరిశ్రమలో ప్రపంచవ్యాప్తంగా తనదైన ముద్ర వేశారు. ఆయన స్థాపించిన 'ఆర్సెలర్ మిట్టల్' సంస్థ ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఉక్కు ఉత్పత్తిదారుగా కొనసాగుతోంది. కంపెనీలో మిట్టల్ కుటుంబానికి సుమారు 40 శాతం వాటా ఉంది. 2021లో లక్ష్మీ మిట్టల్ సీఈఓ పదవి నుంచి వైదొలగగా ఆయన కుమారుడు ఆదిత్య మిట్టల్ ఆ బాధ్యతలను స్వీకరించారు.

సుమారు 30 ఏళ్ల పాటు బ్రిటన్‌లో ఉన్నప్పటికీ అక్కడి పన్నుల విధానంలో మార్పుల కారణంగా ఆయన దేశం విడిచి వెళ్లడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 
Lakshmi Mittal
Lakshmi Mittal news
UK tax policy
Arcelor Mittal
Indian billionaire
Switzerland
Dubai
wealth tax
business news
steel industry

More Telugu News