Chandrababu Naidu: కాలుష్యంపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

Chandrababu Naidu orders key measures on pollution in AP
  • అన్ని రకాల ప్లాస్టిక్ వ్యర్థాల నిర్మూలనకు ప్రత్యేక విధానం తీసుకోవాలన్న సీఎం చంద్రబాబు
  • రాష్ట్రంలో కాలుష్యాన్ని సున్నా స్థాయికి తగ్గించాలని వెల్లడి 
  • పంట పొలాల్లో బయోషీట్లు వాడేలా రైతులకు అవగాహన కల్పించాలని సూచన
రాష్ట్రంలో అన్ని రకాల ప్లాస్టిక్ వ్యర్థాలను శాస్త్రీయంగా నిర్మూలించేందుకు ఒక సమగ్ర విధాన నిర్ణయం తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అధికారులను ఆదేశించారు. కాలుష్య నియంత్రణ, పర్యావరణ పరిరక్షణ అంశాలపై ఆయన సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రాన్ని 'జీరో పొల్యూషన్' స్థాయికి తీసుకురావడమే లక్ష్యమని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.

కాలుష్య నియంత్రణ నిబంధనలను అతిక్రమించే సంస్థలు, వ్యక్తులపై వెంటనే చర్యలు తీసుకోకుండా, ముందుగా హెచ్చరికలు జారీ చేయాలని సీఎం సూచించారు. ఆ తర్వాత కూడా మార్పు రాకపోతే కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. బయో వ్యర్థాల నిర్వహణలో ఎలాంటి అలసత్వం ప్రదర్శించవద్దని, గాలి నాణ్యతను పర్యవేక్షించేందుకు ఆధునిక సాంకేతికతను వినియోగించాలని తెలిపారు.

పరిశ్రమలకు అనుమతులు మంజూరు చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని, 'స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్'ను దృష్టిలో ఉంచుకొని రెడ్ జోన్ పరిధిలోని పరిశ్రమలకు 12 రోజుల్లో, ఆరెంజ్ జోన్‌కు 10 రోజుల్లో, గ్రీన్ జోన్‌కు 3 రోజుల్లోనే అనుమతులు ఇవ్వాలని లక్ష్యంగా నిర్దేశించారు. రాష్ట్రంలోని అన్ని మురుగునీటి శుద్ధి కేంద్రాలను (సివరేజీ ట్రీట్‌మెంట్ ప్లాంట్లు) త్వరితగతిన అందుబాటులోకి తీసుకురావాలన్నారు.

పంట పొలాల్లో రైతులు ప్లాస్టిక్ షీట్లకు బదులుగా పర్యావరణహితమైన బయోషీట్లు వాడేలా ప్రోత్సహించాలని, దీనిపై వారికి అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో కాలుష్య నియంత్రణ మండలికి సిబ్బంది కొరత ఉందని సంస్థ ఛైర్మన్ కృష్ణయ్య సీఎం దృష్టికి తీసుకురాగా, అవసరమైన సిబ్బంది నియామకానికి ఆయన వెంటనే అంగీకారం తెలిపారు. 
Chandrababu Naidu
Andhra Pradesh
pollution control
plastic waste management
zero pollution
environment protection
sewage treatment plants
bio sheets
APPCB
Krishnaiah

More Telugu News