Haeli Gubbi: 10,000 ఏళ్లలో తొలిసారి పేలిన ఇథియోపియాలోని హేలీ గుబ్బి అగ్నిపర్వతం

Haeli Gubbi Volcano Erupts in Ethiopia After 10000 Years
  • ఎర్ర సముద్రం మీదుగా ఒమన్, యెమెన్ వైపు విస్తరించిన బూడిద, పొగ
  • అత్యంత అసాధారణ అగ్ని పర్వత విస్పోటనాల్లో ఒకటన్న శాస్త్రవేత్తలు
  • అగ్నిపర్వత విస్పోటనం నేపథ్యంలో విమాన రాకపోకలపై ప్రభావం
ఇథియోపియాలోని ఎర్టా ఆలే శ్రేణిలో ఉన్న హేలీ గుబ్బీ అగ్నిపర్వతం అత్యంత సుదీర్ఘకాలం తర్వాత, దాదాపు 10,000 సంవత్సరాలలో మొదటిసారిగా విస్ఫోటనం చెందింది. దీని నుంచి వెలువడిన బూడిద, పొగ ఎర్ర సముద్రం మీదుగా ఒమన్, యెమెన్ వైపు వ్యాపించాయి. ఈ ప్రాంత చరిత్రలో ఇది ఒక అసాధారణమైన అగ్నిపర్వత విస్ఫోటనమని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. మారుమూల ప్రాంతం కావడంతో ప్రాణ, ఆస్తి నష్టం వివరాలు తెలియాల్సి ఉంది.

హేలీ గుబ్బి అగ్నిపర్వతం నుంచి వెలువడుతున్న బూడిద, పొగ ఉత్తర భారతదేశానికి కూడా విస్తరించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం ఈ అగ్నిపర్వతం విస్ఫోటనం ప్రారంభమైంది. ఆ తర్వాత క్రమంగా వాతావరణంలోకి 10 నుంచి 15 కిలోమీటర్ల ఎత్తు వరకు బూడిద, పొగ వ్యాపించింది.

విస్ఫోటనం వేల మీటర్ల ఎత్తుకు చేరుకోవడంతో విమానాల రాకపోకలపై ప్రభావం పడింది. కేరళలోని కన్నూర్ నుంచి అబుదాబికి బయలుదేరిన విమానాన్ని మార్గమధ్యలో అహ్మదాబాద్‌కు మళ్లించారు. హేలీ గుబ్బి విస్ఫోటనం కారణంగా ఆ ప్రాంతం మీదగా వెళ్లవలసిన విమాన సర్వీసులపై ప్రభావం పడుతుందని భావిస్తున్నారు.
Haeli Gubbi
Ethiopia volcano
Volcanic eruption
Red Sea
Oman
Yemen
Erta Ale range

More Telugu News