Pawan Kalyan: పవన్ కల్యాణ్ వ్యాఖ్యలకు అంబటి రాంబాబు కౌంటర్

Pawan Kalyan targeted by Ambati Rambabu over Tirumala ghee issue
  • రైతుల సమస్యల నుంచి దృష్టి మళ్లించడానికే నెయ్యి వివాదం అంటూ ఫైర్
  • పవన్ కల్యాణ్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారన్న అంబటి
  • గోబెల్స్ ప్రచారాన్ని మించిపోయారంటూ తీవ్ర విమర్శలు
  • తిరుమల లడ్డూ ప్రసాదంపై డ్రామాలు ఆపాలంటూ హితవు
  • పలు అంశాలపై పవన్ మౌనాన్ని ప్రశ్నించిన అంబటి
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌పై వైసీపీ నేత అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో రైతులు తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుంటే, ఆ సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే తిరుమల నెయ్యి వివాదాన్ని తెరపైకి తెచ్చారని ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబును ప్రజా వ్యతిరేకత నుంచి కాపాడేందుకు పవన్ కల్యాణ్ ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ఈ మేరకు పవన్ ట్వీట్ కు కౌంటర్ ఇచ్చారు. 

"రాష్ట్రంలో రైతులు పంట నష్టాలతో, అప్పుల భారంతో కుంగిపోతుంటే, చంద్రబాబును ప్రజా వ్యతిరేకత నుంచి కాపాడటానికి మీరు మరోసారి డైవర్షన్ పాలిటిక్స్‌ను తెరపైకి తెచ్చారు. పంట అమ్ముకుంటే కోత ఖర్చులు కూడా రావని రైతులు పొలాల్లోనే పంటను వదిలేసి రోడ్లపై పారబోస్తుంటే, వారికి మద్దతు ధర, నష్టపరిహారం కోసం పోరాడాల్సింది పోయి.. తిరుమల లడ్డూ ప్రసాదాన్ని రాజకీయాల్లోకి లాగి వార్తలను పక్కదారి పట్టిస్తున్నారు.

మీరు, చంద్రబాబు కలిసి తప్పుడు ప్రచారాలు చేయడంలో, వాటిని ప్రజలతో నమ్మించడంలో గోబెల్స్‌ను కూడా మించిపోయారు. ఈసారి ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది హిందువుల మనోభావాలనే లక్ష్యంగా చేసుకున్నారు.

గతంలో రాష్ట్రంలో 30,000 మంది మహిళలు అదృశ్యమయ్యారని, సుగాలి ప్రీతి మృతికి మా పార్టీ వాళ్లే కారణమని ప్రచారం చేశారు. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి అయ్యాక మీరు మౌనంగా ఉండటాన్ని చూస్తే, అవన్నీ కేవలం తప్పుడు ప్రచారాలేనని మీరే నిరూపించారు. ఈ నెయ్యి వివాదం కూడా ఆ కోవలోనిదే.

సంచలన ట్వీట్లు చేసే ముందు మీరు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి:
* ఆరోపణలు ఎదుర్కొంటున్న నెయ్యి ట్యాంకర్లు లడ్డూ తయారీ కేంద్రంలోకి వెళ్లాయా? లేదా?
* నెయ్యిలో జంతువుల కొవ్వు ఉన్నట్లు నిర్ధారణ అయిందా? లేదా?
సిట్ విచారణ జరుగుతుంటే, అధికారిక ల్యాబ్ రిపోర్టులు విడుదల చేయకుండా ఎంపిక చేసిన లీకులు ఎందుకు బయటకు వదులుతున్నారు?

విశాఖలో టీడీపీ నేతలతో సంబంధమున్న 200 టన్నుల నిషేధిత బీఫ్ పట్టుబడితే ఎందుకు మౌనంగా ఉన్నారు? మీ ప్రభుత్వం వచ్చాక టీటీడీ గోశాలలో వందల ఆవులు చనిపోతే ఎందుకు మాట్లాడలేదు? మీ నిర్లక్ష్యం వల్ల తిరుమలలో ఆరుగురు, సింహాచలంలో ఏడుగురు భక్తులు మరణిస్తే ఎందుకు స్పందించలేదు? చంద్రబాబు హయాంలో వినియోగించిన ట్యాంకర్ల గురించే ఇప్పుడు మాట్లాడుతూ, మమ్మల్ని నిందించడం ఏమిటి? మా హయాంలో కేజీ నెయ్యి ధర రూ. 326 అయితే అవినీతి అన్న మీరు, చంద్రబాబు హయాంలోని రూ. 276, రూ. 295 ధరల గురించి ఏం సమాధానం చెబుతారు?

తిరుమల క్షేత్రం డైవర్షన్ పాలిటిక్స్ చేసే వేదిక కాదు. ప్రజల విశ్వాసం పవిత్రమైనది, అది చంద్రబాబుకు రాజకీయ కవచం కాదు" అంబటి రాంబాబు తన ట్వీట్ లో పేర్కొన్నారు.
Pawan Kalyan
Ambati Rambabu
Tirumala ghee controversy
Chandrababu Naidu
YS Jagan Mohan Reddy
TDP
YSRCP
Andhra Pradesh politics
Farmers issues
Tirumala laddu
Diversion politics

More Telugu News