Justice Surya Kant: తొలిరోజు 17 కేసులను విచారించిన సీజేఐ, ఆ విషయంలో కొత్త నియమం అమలు!

Justice Surya Kant First Day as CJI New Rule Implemented
  • సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నేడు ప్రమాణం చేసిన జస్టిస్ సూర్యకాంత్
  • అర్జెంట్ లిస్టింగ్ కేసులను లిఖితపూర్వకంగా సమర్పించాలంటూ కొత్త నియమం
  • మరణశిక్ష, వ్యక్తిగత స్వేచ్ఛకు విఘాతం వంటి అసాధారణ పరిస్థితుల్లో మినహాయింపు
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ నేడు ప్రమాణ స్వీకారం చేశారు. సీజేఐ హోదాలో తొలిరోజునే 17 కేసులను విచారించారు. అదే సమయంలో ఒక కొత్త విధానపరమైన నియమాన్ని తీసుకువచ్చారు. ఇకపై అత్యవసరంగా విచారణకు స్వీకరించాల్సిన కేసుల (అర్జెంట్ లిస్టింగ్ కేసులు)ను తప్పనిసరిగా లిఖితపూర్వకంగా సమర్పించాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. మరణశిక్ష, వ్యక్తిగత స్వేచ్ఛకు విఘాతం కలిగే అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే మౌఖిక అభ్యర్థనలను అనుమతిస్తామని తెలిపారు.

జస్టిస్ సూర్యకాంత్ సుప్రీంకోర్టు 53వ సీజేఐగా ప్రమాణం చేసిన అనంతరం రాష్ట్రపతి భవన్ నుంచి సుప్రీంకోర్టుకు చేరుకున్నారు. న్యాయస్థానం ప్రాంగణంలోని గాంధీ, అంబేద్కర్ విగ్రహాలకు నివాళులర్పించారు.

ఆ తర్వాత ఒకటో నెంబరు కోర్టు రూమ్‌లో జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చీ, జస్టిస్ అతుల్ ఎస్. చందూర్కర్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనానికి ఆయన నేతృత్వం వహించారు. హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ఒక ప్రైవేటు సంస్థకు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్‌పై తీర్పును వెలువరించారు. జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం రెండు గంటల్లో దాదాపు 17 కేసులను విచారించింది.
Justice Surya Kant
CJI Surya Kant
Supreme Court
urgent listing cases
oral requests

More Telugu News