పంచాయతీ ఎన్నికలు.. అభ్యర్థులకు కేరళలోని రైతు సంఘం షరతు

  • నాయకులు, అభ్యర్థుల ముందు కేరళ స్వతంత్ర రైతు సంఘం డిమాండ్
  • రైతుల ఆత్మరక్షణ హక్కును సమర్థించే అఫిడవిట్‌పై సంతకం చేయాలని డిమాండ్
  • లేదంటే ఎన్నికలను బహిష్కరిస్తామని అల్టిమేటం
కేరళలో డిసెంబర్ నెలలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఈ క్రమంలో కేరళ స్వతంత్ర రైతు సంఘం (కేఐఎఫ్ఏ) రాజకీయ నాయకుల ముందు ఒక డిమాండ్ ఉంచింది. తమ డిమాండుతో కూడిన లేఖపై సంతకం చేస్తేనే ఓట్లు వేస్తామని షరతు విధించింది.

అడవి జంతువుల దాడుల నుంచి రైతుల ఆత్మరక్షణ హక్కును సమర్థిస్తూ రాతపూర్వక అఫిడవిట్‌పై సంతకం చేయాలని, లేదంటే స్థానిక సంస్థల ఎన్నికలను బహిష్కరిస్తామని స్పష్టం చేసింది.

క్రూర మృగాల నుంచి స్వీయ రక్షణ కోసం ఒక్కోసారి వాటిపై దాడి చేసి, చంపాల్సి వస్తోందని, అలాంటి సమయాల్లో రైతుల స్వీయ రక్షణ హక్కుకు మద్దతు ఇస్తున్నట్లు రూపొందించిన రాతపూర్వక అఫిడవిట్‌పై సంతకాలు చేయాలని రైతు సంఘం ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులను కోరింది.

వన్యప్రాణుల రక్షణ చట్టం ప్రకారం అటవీ ప్రాంతం వెలుపల వన్యప్రాణులు దాడి చేస్తే ప్రాణరక్షణలో భాగంగా వాటిని చంపినా, గాయపరిచినా వారికి ఎటువంటి శిక్ష పడదు. అయితే, చట్టవిరుద్ధంగా వన్యప్రాణులను వేటాడి, చంపితే ఈ రక్షణ వర్తించదు. కొన్ని సందర్భాల్లో దాడి చేసిన వన్యప్రాణులను చంపినప్పటికీ వేటాడుతున్నట్లు ఆరోపిస్తూ కేసులు నమోదు చేస్తున్నారని రైతు సంఘం ఆరోపించింది.

అందుకే జంతువుల దాడి నుంచి తప్పించుకోవడానికి రైతుల ఆత్మరక్షణ హక్కుకు మద్దతిచ్చేలా తమ అఫిడవిట్‌పై సంతకాలు చేయాలని పేర్కొంది. 'అడవి జంతువుల దాడిలో రైతుల పక్షాన నిలబడని వారికి ఓటు వేయబోం' అనే నినాదంతో ఈ రైతు సంఘం బోర్డులను కూడా ఏర్పాటు చేసి, గ్రామాల్లో అవగాహన పెంచుతోంది.


More Telugu News