Tamil Nadu Cyclone: రాగల 48 గంటల్లో బంగాళాఖాతంలో తుపాను

Tamil Nadu Cyclone alert issued for Bay of Bengal
  • హిందూ మహాసముద్రంలో ఒకేసారి క్రియాశీలకమైన మూడు వ్యవస్థలు
  • తమిళనాడులోని పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ
  • రాబోయే కొద్ది రోజుల పాటు కొనసాగనున్న భారీ వర్షాలు
  • శనివారం నుంచి ఏపీ దక్షిణ కోస్తాపై ప్రభావం!
హిందూ మహాసముద్రంలో ఒకేసారి మూడు కీలక వాతావరణ వ్యవస్థలు బలపడటంతో తమిళనాడుపై తుపాను గండం పొంచి ఉంది. రానున్న 48 గంటల్లో దక్షిణ బంగాళాఖాతంలో తుపాను ఏర్పడే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం (ఆర్ఎంసీ) హెచ్చరించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని పలు జిల్లాలకు భారీ నుంచి అతి భారీ వర్ష సూచన జారీ చేసింది.

ఆర్ఎంసీ డైరెక్టర్ ఏ. ఆముద మీడియాకు వివరాలు వెల్లడించారు. హిందూ మహాసముద్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో మూడు ఆవర్తనాలు క్రియాశీలకంగా ఉన్నాయని తెలిపారు. అండమాన్ సముద్రంలో ఆదివారం ఏర్పడిన తీవ్ర వాయుగుండం పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతూ మలేషియా, మలక్కా జలసంధి సమీపంలో కేంద్రీకృతమై ఉందని చెప్పారు. ఇది రాబోయే 24 గంటల్లో మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా, ఆ తర్వాత 48 గంటల్లో తుపానుగా మారే అవకాశం ఉందని అంచనా వేశారు.

మరోవైపు కన్యాకుమారి ప్రాంతంలో కొనసాగుతున్న అల్పపీడన ద్రోణి ప్రభావంతో రేపు (నవంబర్ 25) కన్యాకుమారి సముద్రం, నైరుతి శ్రీలంక జలాల్లో కొత్త అల్పపీడనం ఏర్పడే సూచనలు ఉన్నాయని తెలిపారు. అరేబియా సముద్రంలోని మూడో ఆవర్తనం కూడా స్థిరంగా ఉందని, ఈ మూడు వ్యవస్థలు ఒకదానిపై ఒకటి ప్రభావం చూపే అవకాశం ఉందని ఆమె వివరించారు.

ఈశాన్య రుతుపవనాలు తీవ్రం కావడంతో గత 24 గంటలుగా తమిళనాడులో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే నాలుగు ప్రాంతాల్లో అతి భారీ వర్షపాతం, 15 ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైంది. రాబోయే రోజుల్లో తెన్కాశి, తిరునల్వేలి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. నవంబర్ 29 వరకు కన్యాకుమారి, తూత్తుకుడి, తంజావూరు, తిరువారూర్, నాగపట్నం సహా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారిక సూచనలు పాటించాలని అధికారులు కోరారు.

కాగా, కొన్ని ప్రైవేటు వాతావరణ సంస్థల అంచనాల ప్రకారం... తుపాను ప్రభావం ఏపీ దక్షిణ కోస్తాపై తీవ్ర స్జాయిలో ఉండే అవకాశం కనిపిస్తోంది. ఈ తుపాను ప్రభావం శనివారం నుంచి ఏపీ కోస్తా జిల్లాలపై ఉంటుందని అంచనా.
Tamil Nadu Cyclone
Bay of Bengal cyclone
RMC
IMD
heavy rainfall alert
Andaman Sea
private weather agencies
AP coast
weather forecast
Rainfall

More Telugu News