Telangana Panchayat Elections: పంచాయతీ ఎన్నికలు.. ఎన్నికల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ

Telangana Government Ready for Panchayat Elections Notifies Election Commission
  • పంచాయతీ ఎన్నికలకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపిన ప్రభుత్వం
  • సర్పంచ్, వార్డు సభ్యుల గెజిట్‌లను ఎన్నికల సంఘానికి పంపించిన ప్రభుత్వం
  • పాత రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలను నిర్వహించాలని నిర్ణయం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలకు సంసిద్ధంగా ఉన్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘానికి తెలియజేసింది. ఈ మేరకు ఎన్నికల సంఘానికి వివరాలను సమర్పిస్తూ, ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని లేఖలో పేర్కొంది. జిల్లాల కలెక్టర్లు సమర్పించిన సర్పంచ్, వార్డు సభ్యుల గెజిట్‌లను ప్రభుత్వం ఎన్నికల సంఘానికి పంపింది.

ప్రస్తుతమున్న రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వం కసరత్తు పూర్తి చేసింది. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్ల కేటాయించడంతో పాటు, లాటరీ పద్ధతిలో మహిళా రిజర్వేషన్లను కూడా ఖరారు చేసింది.

ఇదిలా ఉండగా, పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరగాల్సి ఉండగా, ప్రధాన న్యాయమూర్తి సెలవులో ఉండటం వలన విచారణ జరగలేదు. ఈ కేసు మంగళవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది. రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా నోటిఫికేషన్ జారీ చేయడానికి సిద్ధంగా ఉంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 12,733 పంచాయతీలు, 1,12,288 వార్డులకు మూడు విడతలుగా ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది.
Telangana Panchayat Elections
Telangana
Panchayat Elections
State Election Commission

More Telugu News