Vangalapudi Anita: పార్టీ ఉంటేనే మనకు గుర్తింపు: అనిత

Vangalapudi Anita Emphasizes Importance of TDP for Leaders Recognition
  • టీడీపీ ఉంటేనే నాయకులకు గుర్తింపు ఉంటుందన్న అనిత
  • అధికారం వచ్చిందని ఎవరూ నిర్లక్ష్యంగా ఉండొద్దని సూచన
  • స్థానిక ఎన్నికల్లో కూటమి గెలుపునకు కృషి చేయాలని పిలుపు
తెలుగుదేశం పార్టీ ఉంటేనే నాయకులుగా మనలాంటి వారికి గుర్తింపు ఉంటుందని, అధికారం చేతికి వచ్చిందన్న నిర్లక్ష్యం ఎవరిలోనూ ఉండకూడదని రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం సారిపల్లిపాలెంలోని తన క్యాంపు కార్యాలయంలో పాయకరావుపేట నియోజకవర్గ టీడీపీ కమిటీల ప్రమాణస్వీకార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు.

కార్యక్రమం ప్రారంభంలో జిల్లా అధ్యక్షుడు తాతయ్య బాబుతో కలిసి మంత్రి అనిత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించి, నూతన కమిటీల సభ్యులతో ప్రమాణం చేయించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. "గత ప్రభుత్వ పాలనలో ఎన్నో అవమానాలు, కష్టాలు ఎదుర్కొన్న కార్యకర్తల సమష్టి కృషితోనే నేడు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కష్టపడి పనిచేసే వారికే పార్టీలో ప్రాధాన్యత ఉంటుంది. పదవులను అలంకరణగా కాకుండా బాధ్యతగా భావించాలి" అని సూచించారు.

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇదే స్ఫూర్తితో పనిచేసి కూటమి అభ్యర్థుల విజయం కోసం ప్రతిఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. త్వరలోనే నర్సీపట్నం అడ్డు రోడ్డు అభివృద్ధి పనులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. రానున్న ఎన్నికల నాటికి నియోజకవర్గంలో ప్రతి కుటుంబానికి ఉద్యోగం కల్పించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. 
Vangalapudi Anita
Telugu Desam Party
Payakaraopeta
Andhra Pradesh Politics
Nakkapalli
Local Body Elections
TDP Leaders
State Home Minister
Coalition Government
Narsipatnam

More Telugu News