Ibomma Ravi: హీరోలకు వందల కోట్లు ఎందుకు?.. టాలీవుడ్‌పై ఐబొమ్మ రవి తండ్రి తీవ్ర విమర్శలు

Iboma Ravi Father Criticizes Film Industry Practices
  • సినీ నిర్మాత సీ. కళ్యాణ్‌పై  ఐబొమ్మ రవి తండ్రి అప్పారావు తీవ్ర వ్యాఖ్యలు
  • నా కొడుకు ఆకలితో, పస్తులతో పెరిగాడని భావోద్వేగం
  • హీరోల వందల కోట్ల రెమ్యూనరేషన్, థియేటర్ల దోపిడీపై తీవ్ర విమర్శలు
  • తన భార్యది క్రిమినల్ మైండ్ అని, కొడుక్కి అవే జీన్స్ వచ్చాయని ఆరోపణలు
  • కొడుకు సంపాదించిన డబ్బు తనకు వద్దని, చట్టప్రకారమే చర్యలు ఉండాలని వ్యాఖ్య
గత కొంతకాలంగా తెలుగు సినీ పరిశ్రమను, ప్రేక్షకులను ఓ ఊపు ఊపుతున్న పేరు 'ఐబొమ్మ'.  ఈ వెబ్‌సైట్ సృష్టికర్త  రవి తండ్రి అప్పారావు తాజాగా ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు  కలకలం రేపుతున్నాయి. కొడుకు చర్యలను చట్టపరంగా తప్పుబడుతూనే, అతని వెనుక ఉన్న ఆకలి కేకలను, సినీ పరిశ్రమలోని లోపాలను, తన కుటుంబంలోని కలహాలను భావోద్వేగంతో బయటపెట్టారు.

'సి. కళ్యాణ్‌పై తీవ్ర ఆగ్రహం
సినీ నిర్మాత  సికళ్యాణ్ తన కొడుకును ఉద్దేశించి "వాడిని కాల్చేయండి" అన్నారని ఆరోపిస్తూ అప్పారావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. "నా కొడుకుని కాల్చమంటున్నారు, ఆ నొప్పి ఏంటో తెలియట్లేదు. అదే ఆయన కొడుకుని కాలిస్తే ఆ నొప్పి ఏంటో తెలుస్తుంది. వందల, వేల కోట్లు మింగేయడానికి నా కొడుకు అడ్డు వచ్చాడనే వాళ్లకు అంత కోపం. నా కొడుకును అన్నాడు కాబట్టే నేను  కల్యాణ్‌ను అంటున్నాను, అంతేకానీ ఆయనపై నాకు వ్యక్తిగత పగ లేదు" అంటూ ఓ తండ్రిగా తన ఆవేదనను వెళ్లగక్కారు.

ఆకలి నుంచే ఐబొమ్మ పుట్టింది
తన కొడుకు రవి ఈ స్థాయికి రావడానికి, ఇలాంటి మార్గాన్ని ఎంచుకోవడానికి కారణం ఆకలి, పేదరికమేనని అప్పారావు కన్నీటిపర్యంతమయ్యారు. "వాడు ఆకలిలోంచి పుట్టాడు. ఇంట్లో సమస్యల వల్ల నేను, నా భార్య విడిపోయాం. వాడు ఒంటరివాడయ్యాడు. ఇంట్లో అన్నం లేక పస్తులున్నాడు. హైదరాబాద్‌లో కూడా పస్తులుండి ఆకలితోనే పని నేర్చుకున్నాడు. ఆ పట్టుదల పస్తుల్లోంచే వచ్చింది" అని చెబుతూ భావోద్వేగానికి గురయ్యారు. కొడుకు చేసింది తప్పే అయినా, ఈ రోజు కోట్లాది మంది సామాన్యులు అతనికి మద్దతుగా నిలవడం చూస్తున్నామని, కానీ ఆ పేరు, ప్రఖ్యాతులు తనకు వద్దని, తన కొడుకు ఇంట్లో ఉంటే చాలని అన్నారు.

సినీ పరిశ్రమపై ప్రశ్నల వర్షం
సినిమా పరిశ్రమలోని పోకడలను అప్పారావు తీవ్రంగా విమర్శించారు. హీరోలకు వందల కోట్ల రూపాయల పారితోషికం ఇవ్వడాన్ని ఆయన తప్పుబట్టారు. "ఒక ఐఏఎస్, ఐపీఎస్ అధికారి దేశం కోసం రాత్రింబవళ్లు కష్టపడితే లక్షల్లో జీతం వస్తుంది. కానీ వీళ్లు కట్ కట్ అంటూ కాస్త నటిస్తే వందల కోట్లు ఎలా ఇస్తారు? ఇది నిర్మాతల బుద్ధిలేని పని. తక్కువ రెమ్యూనరేషన్‌తో నటించే సుమన్, రాజశేఖర్ లాంటి వాళ్లకు అవకాశాలు ఎందుకు ఇవ్వరు? కొత్త వాళ్లను ఎందుకు ప్రోత్సహించరు? యూనివర్సిటీలకు వెళితే ఎంతోమంది ప్రతిభావంతులు, అందమైన యువతీ యువకులు దొరుకుతారు కదా?" అని ప్రశ్నించారు. పరిశ్రమలో నెపోటిజం ఉందని, వారసత్వం ఉన్నవాళ్లకే అవకాశాలు దక్కుతున్నాయని ఆరోపించారు.

థియేటర్లలో తినుబండారాల ధరలు ఆకాశాన్ని అంటడంపై కూడా ఆయన మండిపడ్డారు. "ఒక పేదవాడు కుటుంబాన్ని సినిమాకు తీసుకెళితే రూ.1000 ఖర్చవుతుంది. ఆ డబ్బుతో నాలుగు రోజులు కూరగాయలు వస్తాయి. ఈ బాధ లేకుండా నా కొడుకు ఫ్రీగా సినిమాలు చూపిస్తున్నాడని పేదవాడు సంతోషిస్తున్నాడు. నష్టం వస్తుందని డబ్బున్నోడు, నిర్మాతలు ఏడుస్తున్నారు. వాళ్లు బ్లాక్ మనీని వైట్ చేసుకోవడానికే సినిమాలు తీస్తున్నారు" అంటూ సంచలన ఆరోపణలు చేశారు.

కుటుంబ కలహాలు, భార్యపై ఆరోపణలు
తన వ్యక్తిగత, కుటుంబ జీవితంలోని చేదు అనుభవాలను కూడా అప్పారావు పంచుకున్నారు. తన భార్యది 'క్రిమినల్ బ్రెయిన్ అని, కొడుక్కి కూడా అవే జీన్స్ వచ్చాయని షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. "నా భార్య నన్ను చాలా ఇబ్బంది పెట్టింది. ఆమె ఆలోచనా విధానం వేరు. నేను చెప్పింది కాకుండా వాళ్ల అమ్మ చెప్పిందే వాడు వినేవాడు. పిల్లల్ని తప్పుడు మార్గంలో ప్రోత్సహిస్తే ఇలాగే తయారవుతారు. ఆ బాధలు పడలేకే నేను విడిగా వచ్చేశాను. ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నాను" అని తెలిపారు.

తన కొడుకు వందల కోట్లు సంపాదించాడని అంటున్నారని, కానీ తనకు ఆ డబ్బు అక్కర్లేదని, వాడు పంపలేదని స్పష్టం చేశారు. తనకు వచ్చే పెన్షన్‌తోనే సంతోషంగా జీవిస్తున్నానని, చట్టం తన పని తాను చేసుకుపోతుందని అన్నారు. 
Ibomma Ravi
Ibomma
C Kalyan
Telugu film industry
movie piracy
Apparao interview
film producers
movie theaters
Tollywood
OTT platforms

More Telugu News