Dharmendra: బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర కన్నుమూత

Dharmendra Bollywood Actor Passes Away at 89
  • కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ధర్మేంద్ర
  • ఇటీవల బీచ్ కాండీ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న ధర్మేంద్ర
  • డిశ్చార్జ్ తర్వాత ఇంట్లో వైద్యుల పర్యవేక్షణలో ఉన్న బాలీవుడ్ నటుడు
బాలీవుడ్ ప్రముఖ నటుడు ధర్మేంద్ర (89) కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నేడు తుదిశ్వాస విడిచారు. ఇటీవల ఆయన ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చికిత్స కూడా తీసుకున్నారు. డిశ్చార్జ్ అయ్యాక ఇంట్లో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. 300కు పైగా చిత్రాల్లో నటించిన ఆయన యాక్షన్ కింగ్‌గా, బాలీవుడ్ హీ-మ్యాన్‌గా గుర్తింపు పొందారు.

భారతీయ చిత్ర పరిశ్రమలో అత్యంత విజయవంతమైన నటులలో ధర్మేంద్ర ఒకరు. ఆరు దశాబ్దాలకు పైగా కెరీర్‌లో అనేక బ్లాక్‌బస్టర్ చిత్రాలు వచ్చాయి. ధర్మేంద్రకు ఇద్దరు భార్యలు కాగా, ఒకరు ప్రకాశ్ కౌర్, మరొకరు హేమమాలిని. ఆయనకు ఆరుగురు పిల్లలు ఉన్నారు.

ఆయన సూపర్ హిట్ చిత్రాల్లో షోలే, ధరమ్ వీర్, సీతా ఔర్ గీతా, చుప్కే చుప్కే, గజబ్, దో దిశాయే, ఆంఖే, షికార్, ఆయా సావన్ ఝూమ్ కే, జీవన్ మృత్యు, మేరా గావ్ మేరా దేశ్, యాదోం కీ బారాత్ సహా మరెన్నో ఉన్నాయి. 1935 డిసెంబర్ 5వ తేదీన జన్మించిన ధర్మేంద్ర అసలు పేరు ధరమ్ సింగ్ డియోల్. సన్నీ డియోల్, బాబీ డియోల్, ఇషా డియోల్ ఆయన సంతానమే.

1960లో 'దిల్ బీ తేరా హమ్ బీ తేరా'తో ధర్మేంద్ర నటుడిగా చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టారు. ఆయన చివరి చిత్రం 'ఇక్కీస్' త్వరలో విడుదల కానుంది. చిత్ర పరిశ్రమకు ఆయన చేసిన సేవలకు గాను కేంద్ర ప్రభుత్వం 2012లో పద్మభూషణ్‌తో సత్కరించింది. ధర్మేంద్ర రాజకీయాల్లోనూ రాణించారు. 2004లో బికనీర్ నుంచి బీజేపీ ఎంపీగా గెలుపొందారు.
Dharmendra
Bollywood actor
Dharmendra death
Hema Malini
Sunny Deol
Bobby Deol
Isha Deol
Sholay movie

More Telugu News