Indigo Airlines: ఇండిగో ఎయిర్ లైన్స్ పై ప్రయాణికురాలి ఆగ్రహం

Indigo Airlines Passenger Alleges Luggage Theft Negligence
  • ప్రయాణంలో తన లగేజీలో నుంచి రూ.40 వేల విలువైన వస్తువులు పోయాయని ఆరోపణ
  • సీసీటీవీ ఫుటేజీలో దొంగతనం జరిగిన ఆనవాళ్లేమీ దొరకలేదని ఎయిర్ లైన్స్ జవాబు
  • చెకిన్ లగేజీ తరలింపు మొత్తం సీసీటీవీ కెమెరాల పరిధిలో జరగదని ప్రయాణికురాలి వాదన
ఇండిగో ఎయిర్ లైన్స్ పై ఓ మహిళా ప్రయాణికురాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రయాణంలో తన లగేజీలో నుంచి విలువైన వస్తువులు పోయాయని ఫిర్యాదు చేయగా.. సంస్థ నుంచి నిర్లక్ష్యపూరితమైన జవాబు వచ్చిందని ఆరోపించారు. చోరీ జరిగిన ఆనవాళ్లు సీసీటీవీ ఫుటేజీలో కనిపించలేదని పదే పదే చెబుతున్నారని మండిపడ్డారు. వివరాల్లోకి వెళితే..

ముంబైకి చెందిన రితికా అరోరా ఇటీవల ముంబై నుంచి ఢిల్లీకి ఇండిగో విమానంలో ప్రయాణించారు. ఆ సమయంలో తన చెకిన్ లగేజీలో నుంచి రూ.40 వేల విలువైన వస్తువులు పోయాయని చెప్పారు. ఢిల్లీలో ల్యాండయ్యాక తన చెకిన్ లగేజీ తీసుకునేందుకు వెళ్లగా.. తన బ్యాగు చిరిగిపోయి ఉందని, లోపల విలువైన వస్తువులు కనిపించలేదని ఆరోపించారు.

దీనిపై వెంటనే ఇండిగో సిబ్బందికి ఫిర్యాదు చేయగా.. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి దొంగతనం జరిగిందనేందుకు ఎలాంటి ఆధారం లభించలేదని చెప్పారని విమర్శించారు. దీనిపై ఇండిగో సంస్థ వెబ్ సైట్ లో ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయిందన్నారు. ఇండిగో నుంచి కూడా తనకు అదే సందేశం అందిందని చెప్పారు. అయితే, ప్రయాణికుల చెకిన్ లగేజీని విమానంలోకి చేర్చే క్రమంలో అంతటా సీసీటీవీ కెమెరాలు ఉండవనే విషయం రితిక గుర్తుచేశారు. సీసీటీవీ కెమెరాల నిఘా లేనిచోట తన లగేజీని తెరిచి వస్తువులను కాజేసి ఉంటారని ఆమె ఆరోపించారు. ఈ విషయాన్ని లింక్డ్ ఇన్ లో పంచుకుంటూ రితిక ఆవేదన వ్యక్తం చేశారు.
Indigo Airlines
lost luggage
theft
airline complaint
passenger grievance
Mumbai to Delhi flight
Ritika Arora
CCTV footage
airline security
baggage handling

More Telugu News