Prema Wangjam Thongdok: అరుణాచల్ ప్రదేశ్ పేరుతో కవ్వింపు.. షాంఘైలో భారత మహిళకు చైనా వేధింపులు!

Prema Wangjam Thongdok Harassed in Shanghai Over Arunachal Pradesh
  • షాంఘై ఎయిర్‌పోర్ట్‌లో అరుణాచల్ ప్రదేశ్ మహిళకు వేధింపులు
  • పాస్‌పోర్ట్‌పై పుట్టిన ప్రదేశం అరుణాచల్ అని ఉండటమే కారణం
  • "అరుణాచల్ చైనాలో భాగం" అంటూ 18 గంటలు నిర్బంధించిన అధికారులు
  • భారత కాన్సులేట్ జోక్యంతో సురక్షితంగా బయటపడ్డ మహిళ
  • చైనాపై చర్యలు తీసుకోవాలని ప్రధాని మోదీకి బాధితురాలి విజ్ఞప్తి
భారత సంతతికి చెందిన అరుణాచల్ ప్రదేశ్ మహిళకు చైనాలో తీవ్ర అవమానం ఎదురైంది. ఆమె భారత పాస్‌పోర్ట్‌పై పుట్టిన ప్రదేశంగా అరుణాచల్ ప్రదేశ్ అని ఉండటాన్ని చైనా ఇమ్మిగ్రేషన్ అధికారులు అంగీకరించలేదు. ఇది భారతదేశ సార్వభౌమత్వాన్ని ప్రశ్నించడమేనంటూ ఆమెను గంటల తరబడి నిర్బంధించి, తీవ్రంగా వేధించారు.

యూకేలో నివసించే ప్రేమ వాంగ్జోమ్ థోంగ్‌డోక్ అనే మహిళ నవంబర్ 21న లండన్ నుంచి జపాన్‌కు వెళ్లే క్రమంలో షాంఘై పుడాంగ్ విమానాశ్రయంలో ఆగారు. కేవలం మూడు గంటల విరామం కోసం అక్కడ దిగిన ఆమెకు ఇమ్మిగ్రేషన్ కౌంటర్‌లో ఊహించని పరిణామం ఎదురైంది. ఆమె పాస్‌పోర్ట్‌ను చూసిన చైనా అధికారులు "అరుణాచల్ ప్రదేశ్ చైనాలో అంతర్భాగం, కాబట్టి మీ పాస్‌పోర్ట్ చెల్లదు" అని వాదించారు. అంతేకాకుండా, చైనా పాస్‌పోర్ట్‌కు దరఖాస్తు చేసుకోవాలంటూ ఆమెను ఎగతాళి చేసినట్లు ప్రేమ ఆరోపించారు.

మూడు గంటల ప్రయాణ విరామం కాస్తా 18 గంటల నరకంగా మారింది. అధికారులు ఆమె పాస్‌పోర్ట్‌ను స్వాధీనం చేసుకుని, జపాన్‌కు వెళ్లాల్సిన విమానాన్ని ఎక్కకుండా అడ్డుకున్నారు. ఆ సమయంలో కనీసం ఆహారం, ఇతర సౌకర్యాలు కూడా కల్పించకుండా ట్రాన్సిట్ ఏరియాకే పరిమితం చేశారు. కేవలం చైనా ఈస్టర్న్ ఎయిర్‌లైన్స్‌లోనే కొత్త టికెట్ కొనుగోలు చేస్తేనే పాస్‌పోర్ట్ తిరిగి ఇస్తామని ఒత్తిడి తెచ్చినట్లు ఆమె తెలిపారు.

ఈ క్లిష్ట పరిస్థితుల్లో, ఆమె యూకేలోని తన స్నేహితుడి ద్వారా షాంఘైలోని భారత కాన్సులేట్‌ను సంప్రదించారు. విషయం తెలుసుకున్న భారత అధికారులు వెంటనే జోక్యం చేసుకుని, ఆమెను సురక్షితంగా అక్కడి నుంచి పంపించే ఏర్పాట్లు చేశారు.

ఈ ఘటనపై ప్రేమ వాంగ్జోమ్ ప్రధాని నరేంద్ర మోదీకి, ఉన్నతాధికారులకు లేఖ రాశారు. ఇది భారతదేశ సార్వభౌమత్వానికి అరుణాచల్ పౌరులకు జరిగిన అవమానమని ఆమె పేర్కొన్నారు. ఈ విషయాన్ని చైనా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, బాధ్యులైన ఇమ్మిగ్రేషన్, ఎయిర్‌లైన్ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని కోరారు. తనకు జరిగిన ఆర్థిక నష్టానికి పరిహారం ఇప్పించాలని, భవిష్యత్తులో అరుణాచల్ ప్రదేశ్ వాసులకు ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు.
Prema Wangjam Thongdok
Arunachal Pradesh
China
Indian Passport
Shanghai Airport
Immigration
Sovereignty
Narendra Modi
Indian Consulate

More Telugu News