Delhi Air Pollution Protest: ఢిల్లీలో కాలుష్య నిరసనలో హింస.. హిడ్మాపై పోస్టర్ల ప్రదర్శన.. పోలీసులపై పెప్పర్ స్ప్రేతో నిరసనకారుల దాడి

Delhi Air Pollution Protest Turns Violent Police Attacked with Pepper Spray
  • ఢిల్లీలో కాలుష్య నిరసనలో తీవ్ర ఉద్రిక్తత
  • పోలీసులపై పెప్పర్ స్ప్రేతో దాడి చేసిన ఆందోళనకారులు
  • నిరసనలో మావోయిస్టు నేత హిడ్మా పోస్టర్ల కలకలం
  • పలువురు పోలీసులకు గాయాలు, 15 మందికి పైగా అరెస్ట్
దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యానికి వ్యతిరేకంగా చేపట్టిన నిరసన హింసాత్మకంగా మారింది. ఇండియా గేట్ వద్ద ఆదివారం సాయంత్రం జరిగిన ఈ ఆందోళనలో నిరసనకారులు పోలీసులపై పెప్పర్ స్ప్రేతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో పలువురు పోలీసు సిబ్బంది గాయపడ్డారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఢిల్లీలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతూ కొందరు ఇండియా గేట్ వద్ద నిరసనకు దిగారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో ఎన్‌కౌంటర్‌లో మరణించిన మావోయిస్టు కమాండర్ మాద్వి హిడ్మా పోస్టర్లను కూడా వారు ప్రదర్శించారు. ఇండియా గేట్ వద్ద నిరసనలకు అనుమతి లేదని, జంతర్ మంతర్ వద్దే ఆందోళనలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయని పోలీసులు నిరసనకారులకు సూచించారు. అయినప్పటికీ వారు వినకుండా రోడ్డును దిగ్బంధించేందుకు ప్రయత్నించారు.

వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసులపై కొందరు నిరసనకారులు పెప్పర్ స్ప్రే ప్రయోగించారు. ఈ దాడిలో ముగ్గురు, నలుగురు పోలీసుల కళ్లు, ముఖంపై గాయాలయ్యాయి. వారిని వెంటనే రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రికి తరలించారు. నిరసనకారులు పోలీసులపై పెప్పర్ స్ప్రే ప్రయోగించడం ఇదే మొదటిసారని, ఇది చాలా అసాధారణమైన ఘట‌న అని డీసీపీ (న్యూఢిల్లీ) దేవేష్ కుమార్ మహ్లా తెలిపారు.

ఈ గందరగోళం మధ్య పోలీసులు 15 నుంచి 20 మంది ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వ విధులకు ఆటంకం కలిగించినందుకు, ఇతర సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మావోయిస్టు నేత పోస్టర్ల వెనుక ఉన్న కోణంపై కూడా విచారణ జరుపుతామని పోలీసులు వెల్లడించారు. కాగా, ఢిల్లీలో ఆదివారం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) 391గా నమోదైంది. ఇది 'చాలా ప్రమాదకరం' కేటగిరీ కిందకు వస్తుంది.
Delhi Air Pollution Protest
Delhi
Air Pollution
India Gate
Pepper Spray
Protest
Maoist Commander Madvi Hidma
Air Quality Index
AQI

More Telugu News