Jupally Krishna Rao: వితంతువుతో ఇందిరమ్మ ఇంటికి భూమిపూజ చేయించిన మంత్రి జూపల్లి

Minister Jupally Initiates Indiramma House Construction with Widow
  • వితంతువుతో పూజ వద్దంటూ స్థానికుల అభ్యంతరం
  • మూఢనమ్మకంపై ఆగ్రహం వ్యక్తంచేసిన మంత్రి జూపల్లి
  • ఆమెతోనే కొబ్బరికాయ కొట్టించి ఆదర్శంగా నిలిచిన మంత్రి
  • సాంఘిక దురాచారాలు మన సంస్కృతికి మచ్చ అని వ్యాఖ్య
సాంఘిక దురాచారాలను, మూఢనమ్మకాలను సమాజం నుంచి తరిమికొట్టాలని తెలంగాణ ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు. నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం మాచినేనిపల్లిలో ఓ అభ్యుదయ ఘటనకు ఆయన నాంది పలికారు. వితంతువు చేత ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమిపూజ చేయించి ఆదర్శంగా నిలిచారు.

ఆదివారం మాచినేనిపల్లి గ్రామంలో రాములు అనే లబ్ధిదారుడికి మంజూరైన ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి మంత్రి జూపల్లి భూమిపూజ కార్యక్రమానికి హాజరయ్యారు. రాములు భార్య గర్భవతి కావడంతో, మంత్రినే పూజ చేయాలని స్థానిక కాంగ్రెస్ నాయకులు, గ్రామస్థులు కోరారు. అయితే, రాములు తల్లి లక్ష్మీదేవమ్మతో పూజ చేయించాలని మంత్రి సూచించారు. ఆమె వితంతువు కావడంతో పూజకు అనర్హురాలని కొందరు అనడంతో మంత్రి జూపల్లి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

"వితంతువు అయితే భూమిపూజ చేయకూడదా?" అంటూ వారిని ప్రశ్నించిన మంత్రి, స్వయంగా లక్ష్మీదేవమ్మను పిలిచి ఆమె చేతనే కొబ్బరికాయ కొట్టించి పూజా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 200 ఏళ్ల క్రితమే రాజా రామ్మోహన్‌రాయ్ వంటి సంఘ సంస్కర్తలు సతీసహగమనం, బాల్యవివాహాలను రూపుమాపి, వితంతు వివాహాలను ప్రోత్సహించారని గుర్తుచేశారు. ఇంత ఆధునిక సమాజంలో కూడా వితంతువులను శుభకార్యాలకు దూరం పెట్టడం మన సంస్కృతికి మచ్చ అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి దురాచారాలను ఎంత త్వరగా వదిలించుకుంటే సమాజానికి అంత మంచిదని హితవు పలికారు.
Jupally Krishna Rao
Telangana
Minister Jupally
Widow
Indiramma House
ഭൂമിപൂജ
Nagarkurnool
Kolapur
Social Evils
Superstitions

More Telugu News