TTD Board: వైసీపీ హయాంలో 20 కోట్ల కల్తీ లడ్డూలు.. సిట్ దర్యాప్తులో వెలుగులోకి!

TTD Board Tirumala Laddu Prasadam Adulteration Scandal Exposed
  • వైసీపీ హయాంలో కల్తీ నెయ్యితో శ్రీవారి లడ్డూలు
  • సిట్ విచారణలో వెలుగులోకి వచ్చిన సంచలన విషయాలు
  • 20 కోట్ల లడ్డూల్లో పామాయిల్, రసాయనాల వాడకం
  • భారీ అవినీతి జరిగిందన్న టీటీడీ ఛైర్మన్ బీఆర్‌ నాయుడు
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదం తయారీలో భారీ అక్రమాలు జరిగినట్లు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణలో వెలుగులోకి వచ్చింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో 2019 నుంచి 2024 మధ్య ఏకంగా 20.01 కోట్ల లడ్డూలను కల్తీ నెయ్యితో తయారు చేసినట్లు తేలింది. ఈ ఐదేళ్లలో మొత్తం 48.76 కోట్ల లడ్డూలను తయారు చేయగా, అందులో దాదాపు 40 శాతం లడ్డూలను పామాయిల్, పామ్‌కెర్నల్‌ ఆయిల్, ఇతర రసాయనాలతో కూడిన నెయ్యితో తయారు చేసినట్లు సిట్ నిర్ధారించింది.

వైసీపీ హయాంలో టీటీడీ ధర్మకర్తల మండలి నెయ్యి సరఫరా కోసం నాలుగు డెయిరీలకు రూ.250 కోట్లు చెల్లించింది. ఉత్తరాఖండ్‌లోని భోలేబాబా, తమిళనాడులోని ఏఆర్‌, తిరుపతి జిల్లాలోని వైష్ణవి, ఉత్తరప్రదేశ్‌లోని మాల్‌గంగ డెయిరీల నుంచి మొత్తం 1.61 కోట్ల కిలోల నెయ్యి కొనుగోలు చేయగా, అందులో 68 లక్షల కిలోలు కల్తీ అని తేలింది. శ్రీవారి ఆలయంలో రోజూ సుమారు 3.5 నుంచి 4 లక్షల లడ్డూల తయారీకి 12 నుంచి 13 వేల కిలోల నెయ్యి అవసరం. ఐదేళ్లపాటు రోజూ వినియోగించిన నెయ్యిలో 40 శాతం కల్తీదేనని తేలడం భక్తుల్లో ఆందోళన కలిగిస్తోంది.

మరిన్ని అక్రమాలు వెలుగులోకి తెస్తాం: టీటీడీ ఛైర్మన్‌ 
ఈ పరిణామాలపై టీటీడీ ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు తీవ్రంగా స్పందించారు. "వైసీపీ ప్రభుత్వంలోని టీటీడీ ధర్మకర్తల మండలి, అధికారులు కుమ్మక్కై భారీ అవినీతికి పాల్పడ్డారు. తిరుమల క్షేత్రాన్ని ధనార్జన కేంద్రంగా మార్చుకున్నారు. కల్తీ నెయ్యితో తయారు చేసిన లడ్డూలు అందించి భక్తుల మనోభావాలను దెబ్బతీశారు" అని ఆరోపించారు. సిట్ విచారణలో ఈ విషయాలు రుజువయ్యాయని, వైసీపీ హయాంలో తిరుమలలో జరిగిన మరిన్ని అక్రమాలను త్వరలోనే వెలుగులోకి తెస్తామని స్పష్టం చేశారు.
TTD Board
Tirumala
Ladoo
Tirupati
YCP Government
Fake Ghee
BR Naidu
Special Investigation Team
TTD Scam
Andhra Pradesh

More Telugu News