Antibiotics: యాంటీబయాటిక్స్ పనిచేయకపోతే ఏం జరుగుతుంది?

Antibiotics What Happens If They Stop Working
  • యాంటీబయాటిక్స్ వాడకంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన
  • చిన్న ఇన్ఫెక్షన్లు సైతం ప్రాణాంతకంగా మారే ప్రమాదం
  • నిర్లక్ష్యంగా వాడితే ఆధునిక వైద్యానికే పెను ముప్పు
  • వైరల్ జ్వరాలకు యాంటీబయాటిక్స్ వాడొద్దంటున్న నిపుణులు
ఆధునిక వైద్యంలో యాంటీబయాటిక్స్ ఒక వరం. న్యుమోనియా నుంచి మొదలుకొని, శస్త్రచికిత్సల సమయంలో ఇన్ఫెక్షన్లు సోకకుండా నివారించడం వరకు ఇవి ఆరోగ్య సంరక్షణకు వెన్నెముకగా నిలుస్తున్నాయి. అయితే, వీటిని విచక్షణారహితంగా వాడటం వల్ల మానవాళి ఓ కొత్త ప్రమాదం అంచున నిలిచి ఉంది. అదే యాంటీబయాటిక్ రెసిస్టెన్స్. దీని కారణంగా ఒకప్పుడు తేలికగా నయమయ్యే సాధారణ ఇన్ఫెక్షన్లు కూడా భవిష్యత్తులో ప్రాణాంతకంగా మారే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) హెచ్చరిస్తోంది. దీన్ని టాప్ 10 ప్రపంచ ప్రజారోగ్య ముప్పులలో ఒకటిగా పేర్కొంది.

సాధారణంగా జ్వరం, గొంతునొప్పి, దగ్గు వంటి వాటికి చాలామంది వెంటనే యాంటీబయాటిక్స్ వాడుతుంటారు. కానీ వీటిలో ఎక్కువశాతం వైరల్ ఇన్ఫెక్షన్లు. వీటికి యాంటీబయాటిక్స్‌తో సంబంధం లేదు. ఇలా అనవసరంగా వాడటం వల్ల బ్యాక్టీరియా క్రమంగా ఈ మందులను తట్టుకునే శక్తిని పెంచుకుంటోంది. ఇదే కొనసాగితే, భవిష్యత్తులో సాధారణ యూరిన్ ఇన్ఫెక్షన్, కాలికి అయ్యే చిన్న గాయం, లేదా తేలికపాటి ఛాతీ ఇన్ఫెక్షన్ కూడా ప్రాణాంతకంగా మారవచ్చని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

యాంటీబయాటిక్స్ కేవలం ఇన్ఫెక్షన్ల చికిత్సకే కాదు, నివారణకు కూడా కీలకం. మోకాలి మార్పిడి, గుండె ఆపరేషన్లు, అవయవ మార్పిడి వంటి క్లిష్టమైన శస్త్రచికిత్సల సమయంలో ఇన్ఫెక్షన్లు రాకుండా ఇవే కాపాడతాయి. రోగనిరోధక శక్తి తక్కువగా ఉండే క్యాన్సర్ రోగులకు కీమోథెరపీ సమయంలో ఇవి అత్యంత అవసరం. ఈ మందులు పనిచేయకపోతే, ఆధునిక వైద్యంలో ఎన్నో కీలకమైన చికిత్సలు ప్రమాదకరంగా మారతాయి.

వైరల్ జబ్బులకు యాంటీబయాటిక్స్ వాడటం, వైద్యులు సూచించిన కోర్సును మధ్యలోనే ఆపేయడం, ఆసుపత్రులలో సరైన ఇన్ఫెక్షన్ నియంత్రణ లేకపోవడం వంటి కారణాల వల్లే ఈ సమస్య తీవ్రమవుతోందని నిపుణులు వివరిస్తున్నారు. యాంటీబయాటిక్స్‌ను ఒక ఫైర్ ఇంజిన్‌లా చూడాలని, అత్యవసరమైనప్పుడు మాత్రమే వాడితే అది మనల్ని కాపాడుతుందని, అనవసరంగా వాడితే, నిజంగా అవసరమైనప్పుడు అది పని చేయకుండా పోతుందని సూచిస్తున్నారు. ఇప్పటికైనా మేల్కొని, వీటి వాడకంపై బాధ్యతగా వ్యవహరించకపోతే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు.
Antibiotics
Antibiotic resistance
WHO
World Health Organization
Infection
Viral infections
Medical treatment
Public health
Bacteria
Drug resistance

More Telugu News