Revanth Reddy: తెలంగాణ ప్రజలు ఎంత అమాయకంగా కనిపిస్తారో అంతటి చైతన్యవంతులు: రేవంత్ రెడ్డి

Revanth Reddy Comments on Telangana People and Ande Sri
  • అందెశ్రీ సంతాప సభలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
  • కవురు, కళాకారులు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారన్న ముఖ్యమంత్రి
  • తెలంగాణ ప్రజలు అహంకారాన్ని, అధిపత్యాన్ని సహించలేరని వ్యాఖ్య
తెలంగాణ ప్రజలు చూడటానికి ఎంత అమాయకంగా కనిపిస్తారో, అంతటి చైతన్యవంతులని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రవీంద్ర భారతిలో ఏర్పాటు చేసిన ప్రముఖ రచయిత అందెశ్రీ సంతాప సభలో ఆయన ప్రసంగిస్తూ, తెలంగాణ మలిదశ ఉద్యమంలో కవులు, కళాకారులు కీలక పాత్ర పోషించారని కొనియాడారు. వారిచ్చిన స్ఫూర్తితోనే తెలంగాణ కల సాకారమైందని ఆయన అన్నారు.

అందెశ్రీ ఎన్నడూ బడికి వెళ్ళకపోయినా 'జయజయహే తెలంగాణ' వంటి అద్భుతమైన గేయాన్ని రచించారని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమం సమయంలో అందెశ్రీ పాట లేని సభ ఒక్కటి కూడా జరగలేదని ఆయన అన్నారు. గతంలో తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వారిని విస్మరించే ప్రయత్నం జరిగిందని రేవంత్ రెడ్డి ఆరోపించారు.

కవి రాసే పెన్నులపై మన్ను కప్పితే, అవి గన్నులై మొలకెత్తుతాయని, మీ గడీలను కూల్చివేస్తాయని ఆయన హెచ్చరించారు. తెలంగాణ గడ్డపై ప్రజలు అహంకారాన్ని, ఆధిపత్యాన్ని ఏ పరిస్థితుల్లోనూ సహించరని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఎన్ని వజ్రాలున్నా కోహినూర్ వజ్రం ప్రత్యేకమైన విధంగానే, కవులు ఎంతమంది ఉన్నా అందెశ్రీ ప్రత్యేకమని రేవంత్ రెడ్డి అన్నారు.
Revanth Reddy
Telangana
Ande Sri
Telangana Movement
Ravindra Bharathi

More Telugu News