Jupally Krishna Rao: అందుకే ఇచ్చిన హామీలలో జాప్యం జరుగుతోంది: జూపల్లి కృష్ణారావు కీలక వ్యాఖ్యలు

Jupally Krishna Rao Comments on Delay in Promises Due to KCRs Debts
  • కేసీఆర్ చేసిన మితిమీరిన అప్పుల వల్లే హామీల అమలులో జాప్యం అవుతోందన్న మంత్రి
  • సంక్షేమ పథకాలకు అవుతున్న ఖర్చు కంటే, కడుతున్న వడ్డీనే ఎక్కువగా ఉందని వెల్లడి
  • తాము ఇచ్చే చీరలు ఇందిరాగాంధీ కట్టిన వాటిలాగే ఉన్నాయని వెల్లడి
తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ చేసిన మితిమీరిన అప్పుల కారణంగానే ప్రస్తుతం తాము ఇచ్చిన హామీల అమలులో కొంత జాప్యం జరుగుతోందని రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలకు అవుతున్న ఖర్చు కంటే కేసీఆర్ చేసిన అప్పులకు చెల్లిస్తున్న వడ్డీనే ఎక్కువగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు.

ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమంత్రులందరూ చేసిన అప్పుల కంటే పది రెట్లు అధికంగా కేసీఆర్ అప్పులు చేశారని ఆరోపించారు. తద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టేశారని అన్నారు. రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ, ప్రజలకు ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వని హామీలను కూడా అమలు చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.

తమ ప్రభుత్వం మహిళలకు పంపిణీ చేస్తున్న చీరలు గతంలో ఇందిరాగాంధీ కట్టిన చీరల్లాగే ఉన్నాయని ఆయన అన్నారు. నాణ్యతలో రాజీపడకుండా ప్రభుత్వం చీరలను తయారు చేయించిందని తెలిపారు. మహిళా సంఘాల్లోని మహిళలకు కూడా చీరలు అందుతాయని ఆయన చెప్పారు. కొల్లాపూర్‌లో సరైన రోడ్లు కూడా లేవని గతంలో చంద్రబాబు హేళన చేశారని, తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో కిరణ్ కుమార్ రెడ్డిని అభ్యర్థించి నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేయించానని ఆయన గుర్తు చేశారు.
Jupally Krishna Rao
Telangana
BRS
KCR
Loan
Debt
Promises
Welfare schemes
Collapur

More Telugu News