Samrat Choudhary: సామ్రాట్ చౌదరికి కీలక హోంశాఖ... నితీశ్ కుమార్‌ను పక్కకు తప్పిస్తున్నారంటున్న విపక్షాలు

Samrat Choudhary Gets Home Ministry Nitish Kumar sidelined
  • సామ్రాట్ చౌదరికి హోంశాఖ అప్పగింతను స్వాగతించిన జేడీయూ నేతలు
  • ముఖ్యమంత్రిని, జేడీయూను అణిచివేసేందుకేనంటున్న విపక్షాలు
  • రాష్ట్రాన్ని బీజేపీ నియంత్రణలోకి తీసుకుందంటున్న కాంగ్రెస్, ఆర్జేడీ
బీహార్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ దాదాపు 20 ఏళ్లుగా తన ఆధీనంలో ఉంచుకున్న హోంశాఖను తొలిసారిగా ఉప ముఖ్యమంత్రి, బీజేపీ ఎమ్మెల్యే సామ్రాట్ చౌదరికి కేటాయించారు. ఈ నిర్ణయం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. హోంశాఖను బీజేపీ నాయకుడికి అప్పగించడంపై ప్రతిపక్ష ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి.

నితీశ్ కుమార్ రెండు దశాబ్దాలలో మొదటిసారిగా ఈ కీలక శాఖను మరొకరికి అప్పగించడం గమనార్హం. హోంశాఖ బీజేపీ నాయకుడి చేతికి వెళ్లడంతో, కేంద్రంలోని బీజేపీ రాష్ట్ర వ్యవహారాలను మరింతగా నియంత్రిస్తుందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.

సామ్రాట్ చౌదరికి హోంశాఖ అప్పగించడం సముచితమైన నిర్ణయమని, ఆయన సమర్థుడని జేడీయూ నేత, మంత్రి అశోక్ చౌదరి అన్నారు. ఆయన వివిధ మంత్రిత్వ శాఖలను సమన్వయం చేసుకుని ముందుకు సాగుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. నితీశ్ కుమార్ ఎంతో ఆలోచించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారని ఆయన పేర్కొన్నారు.

ముఖ్యమంత్రిని అణిచివేసేందుకే...

ప్రతిపక్ష కూటమి మహాఘట్‌బంధన్‌లోని పార్టీలు మాత్రం ఈ నిర్ణయాన్ని తీవ్రంగా విమర్శిస్తున్నాయి. సామ్రాట్ చౌదరికి హోంశాఖ ఇవ్వడం వెనుక జేడీయూను బలహీనపరచడం, ముఖ్యమంత్రిని అణిచివేయడం బీజేపీ లక్ష్యమని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. సామ్రాట్ చౌదరికి కీలక శాఖను అప్పగించడమంటే నితీశ్ కుమార్‌ను క్రమంగా పక్కకు తప్పించడమేనని విపక్షాలు విమర్శిస్తున్నాయి.

ఆర్జేడీ అధికార ప్రతినిధి మృత్యుంజయ్ తివారి మాట్లాడుతూ, బీజేపీ నితీశ్ కుమార్‌ను కేవలం ముఖ్యమంత్రి కుర్చీలో మాత్రమే కూర్చుండబెట్టిందని, వాస్తవానికి పాలనను వారే చేస్తున్నారని ఆరోపించారు. హోంశాఖను సామ్రాట్ చౌదరికి అప్పగించడం ద్వారా ఇది స్పష్టమైందని ఆయన అన్నారు. నితీశ్ కుమార్ స్థానం ఇప్పుడు ప్రమాదంలో ఉందని, ఆయన పార్టీ కూడా పతనం అంచున ఉందని ఆయన హెచ్చరించారు.

నితీశ్ కుమార్‌ను ఆయన సొంత ప్రభుత్వంలోనే పక్కకు నెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని కాంగ్రెస్ అధికార ప్రతినిధు సురేంద్ర రాజ్‌పుత్ ఆరోపించారు. తాజా చర్యల ద్వారా బీజేపీ బీహార్ మంత్రివర్గాన్ని తన నియంత్రణలోకి తీసుకుందని ఆయన అన్నారు. ఇదిలా ఉండగా, బీహార్‌లో బీజేపీ చేతికి హోంశాఖ రావడంతో ఉత్తరప్రదేశ్ తరహా పాలనను కొందరు ఆశిస్తున్నారు.
Samrat Choudhary
Nitish Kumar
Bihar Politics
Home Ministry
BJP
RJD
Bihar Government

More Telugu News