Kuwara: వెనుక నుంచి పంజా విసిరిన చిరుతపులిని ధైర్యంగా తరిమికొట్టిన 11 ఏళ్ల విద్యార్థి

Kuwara 11 year old bravely fights off leopard attack in Palghar
  • స్నేహితుడితో కలిసి చిరుతపై రాళ్లు విసిరిన కువారా
  • గట్టిగా కేకలు వేయడంతో కర్రలు, రాళ్లతో వచ్చిన సమీపంలోని ప్రజలు
  • అందరిని చూసి అడవిలోకి పారిపోయిన చిరుతపులి
మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో 11 ఏళ్ల విద్యార్థి చిరుతపులితో పోరాటం చేశాడు. అసాధారణ ధైర్య సాహసాలు ప్రదర్శించి తమపై దాడికి ప్రయత్నించిన చిరుతపులిని స్నేహితుడి సహాయంతో అక్కడి నుంచి తరిమికొట్టాడని అధికారులు తెలిపారు. పాల్ఘర్ జిల్లాలోని కాంచడ్ ప్రాంతంలో పాఠశాల నుంచి తిరిగి వస్తుండగా కువారా అనే బాలుడిపై చిరుతపులి వెనుక నుంచి దాడి చేసింది. ఆ సమయంలో బాలుడు వేసుకున్న బ్యాగుపై చిరుత పంజా విసిరింది.

అప్రమత్తమైన బాలుడు గట్టిగా కేకలు వేస్తూ, తన స్నేహితుడితో కలిసి చిరుతపై రాళ్లు విసిరాడు. వారి కేకలు విని సమీపంలోని ప్రజలు కర్రలు, రాళ్లతో పరుగెత్తుకు రావడంతో చిరుతపులి అడవిలోకి పారిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు, అటవీశాఖ అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. చిరుతపులిని గుర్తించడానికి కెమెరా ట్రాప్‌లను, థర్మల్ డ్రోన్‌లను ఉపయోగిస్తున్నట్లు వారు తెలిపారు.

చిరుతను పట్టుకునేందుకు బోన్లను కూడా ఏర్పాటు చేసినట్లు ఫారెస్ట్ డివిజన్ అధికారి పేర్కొన్నారు. దాడిలో కువారా చేతికి గాయం కావడంతో ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. చిరుతను ధైర్యంగా ఎదుర్కొన్న కువారాను అధికారులు అభినందించారు. చిరుతపులి వెనుక నుంచి దాడి చేసిన సమయంలో అతని భుజానికి బ్యాగు ఉండటంతో పెను ప్రమాదం తప్పిందని అధికారులు పేర్కొన్నారు.
Kuwara
Palghar
Leopard attack
Maharashtra
Forest department
Student bravery

More Telugu News