Manchu Manoj: మరో కొత్త ప్రయాణం.. మ్యూజిక్ కంపెనీని ప్రారంభించిన మంచు మనోజ్

Manchu Manoj launches Mohana Raga Music company
  • సంగీత రంగంలోకి అడుగుపెట్టిన నటుడు మంచు మనోజ్
  • ‘మోహన రాగ మ్యూజిక్’ పేరుతో కొత్త సంస్థ ప్రారంభం
  • తండ్రీకొడుకులకు ఇష్టమైన రాగం పేరుతో కంపెనీ ఏర్పాటు
  • కొత్త ప్రతిభను ప్రోత్సహించడమే ప్రధాన లక్ష్యమ‌ని వెల్ల‌డి
  • త్వరలో అంతర్జాతీయ ప్రాజెక్టుల ప్రకటనకు సన్నాహాలు
విలక్షణ నటుడిగా తెలుగు ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మంచు మనోజ్ కొత్త ప్రయాణాన్ని ప్రారంభించారు. నటనతో పాటు తనకు ఎంతో ఇష్టమైన సంగీత రంగంలోకి అడుగుపెడుతూ ‘మోహన రాగ మ్యూజిక్’ పేరుతో ఓ కొత్త సంస్థను ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. ఈ సంస్థ ద్వారా కొత్త ప్రతిభను ప్రోత్సహించడమే లక్ష్యంగా ముందుకు సాగనున్నట్లు తెలిపారు.

మనోజ్‌కు సంగీతంతో ఎప్పటినుంచో బలమైన అనుబంధం ఉంది. గతంలో ‘పోటుగాడు’ చిత్రంలో ఆయన పాడిన ‘ప్యార్ మే పడిపోయానే’ పాట పెద్ద హిట్ అయింది. అంతేకాకుండా ‘మిస్టర్ నూకయ్య’, ‘నేను మీకు తెలుసా’ వంటి చిత్రాలకు గేయ రచయితగానూ పనిచేశారు. తన కుటుంబ సభ్యుల చిత్రాలకు సంగీత విభాగంలో పనిచేయడమే కాకుండా హాలీవుడ్ చిత్రం ‘బాస్మతి బ్లూస్’కు సైతం సంగీత దర్శకుడు అచ్చు రాజమణితో కలిసి పనిచేశారు.

ఈ కొత్త సంస్థ పేరు వెనుక కూడా ఒక ప్రత్యేకత ఉంది. తనకూ, తన తండ్రి డా. మోహన్ బాబుకూ అత్యంత ఇష్టమైన ‘మోహన రాగం’ పేరునే కంపెనీకి పెట్టారు. కొత్త ఆలోచనలతో, ప్రయోగాత్మక సంగీతాన్ని ప్రోత్సహిస్తూ, భారతీయ సంగీతాన్ని అంతర్జాతీయ వేదికపైకి తీసుకెళ్లడమే ‘మోహన రాగ మ్యూజిక్’ ప్రధాన లక్ష్యమని మనోజ్ పేర్కొన్నారు. ఈ లేబుల్ ద్వారా ఒరిజినల్ సింగిల్స్, వినూత్న మ్యూజిక్ ప్రాజెక్టులు రానున్నాయి. త్వరలోనే ఓ భారీ అంతర్జాతీయ ప్రాజెక్టును ప్రకటించనున్నట్లు ఆయన వెల్లడించారు.

Manchu Manoj
Mohana Raga Music
Telugu actor
Music company
Tollywood
New venture
Achu Rajamani
Potugadu song
Indian music
International project

More Telugu News