overload vehicles: ఓవర్ లోడ్ తో వెళుతూ రెండోసారి దొరికితే వాహనం సీజ్.. ఆర్టీఏ నిర్ణయం

Overload vehicles face seizure in Telangana following Ponnam Prabhakars orders
  • తెలంగాణలో నిబంధనలను కఠినతరం చేసిన రవాణా శాఖ
  • రోడ్డు ప్రమాదాలు తగ్గించడమే లక్ష్యంగా పలు నిర్ణయాలు
  • పది రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా వాహన తనిఖీలు
రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా తెలంగాణ రవాణా శాఖ నిబంధనలను మరింత కఠినతరం చేసింది. ఇప్పటికే అమల్లో ఉన్న పలు నిబంధనలను పకడ్బందీగా అమలు చేయడంతో పాటు కొన్ని కొత్త రూల్స్ ను అమలు చేయాలని నిర్ణయించింది. ముఖ్యంగా ఓవర్ లోడ్ తో వెళ్లే వాహనాల పట్ల కఠినంగా వ్యవహరించాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే ఓవర్ లోడ్ తో వెళుతూ పట్టుబడిన వాహనాలకు మొదటిసారి భారీగా ఫైన్ విధించడం, రెండోసారి కూడా పట్టుబడితే అక్కడికక్కడే వాహనాన్ని సీజ్ చేయడంతో పాటు డ్రైవర్ లైసెన్స్ ను రద్దు చేయనున్నట్లు తెలిపింది. ఇటీవల వరుస ప్రమాదాలు, భారీగా ప్రాణనష్టం జరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

ఇటీవల 33 జిల్లాల స్థాయిలో బృందాలను, మూడు రాష్ట్ర స్థాయి ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలను రవాణా శాఖ ఏర్పాటు చేసింది. డీటీసీ, ఆర్టీఏ అధికారులతో వాహనాల తనిఖీలను పకడ్బందీగా నిర్వహించింది. తనిఖీలకు వెళ్లే బృందాలకు చివరి నిమిషంలో సమాచారం ఇవ్వడం ద్వారా అక్రమాలకు తావులేకుండా చర్యలు తీసుకుంది. ప్రతి రోజు ఉదయం 6 గంటలకు ఆయా బృందాలకు సమాచారం అందించి 10 రోజులుగా తనిఖీలు నిర్వహించింది. ఇందులో రోడ్డు నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులను గుర్తించి ఆర్టీఏ అధికారులు 4,748 కేసులు నమోదు చేశారు. మొత్తం 3,420 వాహనాలను సీజ్ చేసినట్లు తెలిపారు.

ఓవర్ లోడ్ తో దూసుకువెళ్లే వాహనాల కారణంగానే ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతుండడంతో వాటిపై దృష్టి సారించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. ఓవర్ లోడ్ తో వెళ్లే వాహనాలను ఆపి భారీ మొత్తంలో జరిమానా విధించాలని సూచించారు. రెండోసారి ఓవర్ లోడ్ తో వాహనం పట్టుబడితే ఆ వాహనాన్ని సీజ్ చేసి పర్మిట్ ను రద్దు చేయాలని ఆదేశించారు. డ్రైవర్ లైసెన్స్ కూడా రద్దు చేసేలా అధికారులు చర్యలు తీసుకోనున్నారు.
overload vehicles
Telangana transport department
Ponnam Prabhakar
road accidents
vehicle seizure
driving license cancellation
RTA rules
DTC
flying squad
Telangana RTA

More Telugu News