Shankarayya: సీఎం చంద్రబాబుకే లీగల్ నోటీసు.. సీఐ శంకరయ్య డిస్మిస్

Shankarayya Dismissed After Legal Notice to Chandrababu Naidu
  • వివేకా హత్య కేసులో అప్పటి సీఐ శంకరయ్యపై వేటు
  • సర్వీసు నుంచి డిస్మిస్ చేస్తూ డీఐజీ ఉత్తర్వులు
  • సాక్ష్యాల చెరిపివేతలో నిర్లక్ష్యం వహించారన్న ఆరోపణలు
  • విచారణ కమిటీ ముందు హాజరుకాకపోవడంతో కఠిన చర్యలు
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న అప్పటి పులివెందుల సీఐ శంకరయ్యపై పోలీసు శాఖ కఠిన చర్యలు తీసుకుంది. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం, కేసు దర్యాప్తు సక్రమంగా చేయకపోవడం వంటి కారణాలతో ఆయన్ను సర్వీసు నుంచి శాశ్వతంగా తొలగిస్తూ (డిస్మిస్) కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.

ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికే లీగల్ నోటీసులు పంపి శంకరయ్య రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. వివేకా హత్య జరిగినప్పుడు ఘటనాస్థలిలో సాక్ష్యాలను చెరిపివేస్తున్నా సీఐగా శంకరయ్య అడ్డుకోలేదని చంద్రబాబు పలు సందర్భాల్లో విమర్శించారు. ఈ వ్యాఖ్యలు తన పరువుకు నష్టం కలిగించాయని పేర్కొంటూ శంకరయ్య సీఎంకు నోటీసులు పంపారు.

2019 మార్చి 15న వివేకా హత్య జరిగినప్పుడు శంకరయ్య పులివెందుల సీఐగా ఉన్నారు. హత్యాస్థలిలో రక్తపు మరకలను శుభ్రం చేస్తున్నా ఆయన వారించలేదని తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ఈ కేసును దర్యాప్తు చేపట్టిన సీబీఐకి ఆయన మొదట కీలక వాంగ్మూలం ఇచ్చారు. కడప ఎంపీ అవినాశ్ రెడ్డి, ఆయన అనుచరులు తనను బెదిరించారని, కేసు నమోదు చేయవద్దని ఒత్తిడి చేశారని తెలిపారు. అయితే, మేజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇచ్చేందుకు మాత్రం నిరాకరించారు. ఆ తర్వాత కొన్ని రోజులకే నాటి జగన్ ప్రభుత్వం ఆయనపై ఉన్న సస్పెన్షన్‌ను ఎత్తివేయడం గమనార్హం.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక శంకరయ్యపై వచ్చిన ఆరోపణల విచారణకు ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ప్రస్తుతం వేకెంట్ రిజర్వ్ (వీఆర్)లో ఉన్న ఆయన, విచారణకు హాజరుకాకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఈ నేపథ్యంలోనే క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ఉన్నతాధికారులు ఆయన్ను సర్వీసు నుంచి తొలగిస్తూ తుది నిర్ణయం తీసుకున్నారు.
Shankarayya
YS Vivekananda Reddy murder case
Chandrababu Naidu
Pulivendula CI
Koya Praveen
Avinash Reddy
CBI investigation
Andhra Pradesh Police
Legal notice
Dismissed from service

More Telugu News