Devji: మావోయిస్టు నేతలు దేవ్‌జీ, రాజిరెడ్డిపై హెబియస్ కార్పస్ పిటిషన్ క్లోజ్

Devji Rajireddy Habeas Corpus Petition Closed by High Court
  • పోలీసుల అదుపులో ఉన్నారని నిరూపించే ఆధారాలు లేవన్న హైకోర్టు
  • ఆధారాలు లభిస్తే మళ్లీ ఆశ్రయించేందుకు పిటిషనర్లకు వెసులుబాటు
  • ఈ కేసులో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసిన ధర్మాసనం
మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌జీ, మల్లా రాజిరెడ్డి పోలీసుల అదుపులో ఉన్నారంటూ దాఖలైన హెబియస్ కార్పస్ పిటిషన్‌ను హైకోర్టు మూసివేసింది. వారిద్దరూ పోలీసుల నిర్బంధంలో ఉన్నారని నిరూపించడానికి ప్రాథమిక ఆధారాలు లేనందున ఈ వ్యాజ్యంలో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. అయితే, భవిష్యత్తులో సరైన ఆధారాలు లభిస్తే మళ్లీ కోర్టును ఆశ్రయించేందుకు పిటిషనర్లకు వెసులుబాటు కల్పించింది. ఈ మేరకు జస్టిస్ సి. మానవేంద్రనాథ్‌రాయ్, జస్టిస్ జి. తుహిన్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.
 
దేవ్‌జీ, రాజిరెడ్డిలను వెంటనే కోర్టు ముందు హాజరుపరిచేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ దేవ్‌జీ సోదరుడు తిప్పిరి గంగాధర్, రాజిరెడ్డి కుమార్తె స్నేహలత హైకోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేశారు. గురువారం జరిగిన విచారణలో, వారిద్దరూ పోలీసుల అదుపులోనే ఉన్నారని చెప్పడానికి ఆధారాలు సమర్పించాలని ధర్మాసనం పిటిషనర్లను ఆదేశించింది.
 
శుక్రవారం ఈ వ్యాజ్యం మరోసారి విచారణకు రాగా, పిటిషనర్ల తరఫు న్యాయవాది యు. జైభీమారావు వాదనలు వినిపించారు. వివిధ పత్రికల్లో వచ్చిన కథనాలు, ఛానళ్లలో ప్రసారమైన వీడియోలను ఒక పెన్‌డ్రైవ్‌లో కోర్టుకు సమర్పించినట్లు తెలిపారు. అయితే, ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది టి. విష్ణుతేజ వాదిస్తూ.. పోలీసు ఉన్నతాధికారుల ప్రెస్‌మీట్‌లో కీలక నేతల భద్రతా సిబ్బంది 9 మందిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారే తప్ప, దేవ్‌జీ, రాజిరెడ్డిల గురించి ప్రస్తావించలేదని స్పష్టం చేశారు. వీడియోలను పరిశీలించిన ధర్మాసనం కూడా ఇదే విషయాన్ని నిర్ధారించి, పిటిషన్‌ను మూసివేస్తున్నట్లు ప్రకటించింది.
Devji
Maoist leaders
Rajireddy
Telangana High Court
Habeas Corpus Petition
Police Custody
Naxalites
CPI Maoist
Telangana News
Indian Maoists

More Telugu News