Sridhar Babu: అందుకే తక్కువ ధరకు భూములు ఇస్తున్నాం: కేటీఆర్‌పై మంత్రి శ్రీధర్ బాబు ఆగ్రహం

Sridhar Babu Slams KTR Over Land Allotment Criticism
  • పదేళ్లు మంత్రిగా ఉన్న కేటీఆర్ ప్రజలకు అవాస్తవాలు చెబుతున్నారన్న శ్రీధర్ బాబు
  • బీఆర్ఎస్ హయాంలో తెచ్చిన జీవో ప్రకారమే భూములు బదిలీ చేస్తున్నామన్న మంత్రి
  • కొన్ని రాష్ట్రాల్లో 99 పైసలకే భూములు ఇస్తున్నారని వెల్లడి
మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపణలు చేస్తున్నారని, కానీ పరిశ్రమలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం భూములను తక్కువ ధరకు ఇస్తోందని తెలంగాణ రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, పదేళ్లు మంత్రిగా ఉన్న కేటీఆర్ ప్రజలకు అసత్యాలు చెబుతున్నారని విమర్శించారు.

తాము గత ప్రభుత్వం మాదిరి అడ్డగోలు జీవోలు, చెల్లింపులు చేయడం లేదని అన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఏం చేసినా దానికి ఓ మతలబు ఉండేదని వ్యాఖ్యానించారు. కేటీఆర్ 9,292 ఎకరాల భూమి గురించి మాట్లాడారని, కానీ పరిశ్రమలను ప్రోత్సహించడం అవసరమని అన్నారు. అయినా 2023లో బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన జీవో ప్రకారమే తాము నగరంలోని భూముల బదిలీకి అనుమతి ఇచ్చామని అన్నారు.

కేటీఆర్ ఫ్రీహోల్డ్, ల్యాండ్ లీజుకు తేడా తెలియనట్లుగా మాట్లాడుతున్నారని, ప్రభుత్వ భూమిని విక్రయించినట్లు ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం హయాంలో కూడా చాలా భూములు బదిలీ చేశారని గుర్తు చేశారు. పారిశ్రామికవేత్తలను ఇబ్బంది పెట్టకూడదని అన్నారు. కొన్ని రాష్ట్రాల్లో 99 పైసలకే భూములను ఇస్తున్నారని గుర్తు చేశారు. పెట్టుబడులు తీసుకురావడం, ఉపాధి పెంచడమే తమ ప్రభుత్వం లక్ష్యమని అన్నారు.

బీఆర్ఎస్ నేతలు తమ ప్రభుత్వంపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల తర్వాత ఆ పార్టీ నేతలకు పగలు కూడా చుక్కలు కనిపిస్తున్నాయని ఎద్దేవా చేశారు. పెట్టుబడులు రాకూడదు.. తెలంగాణ అభివృద్ధి చెందకూడదని కేటీఆర్ ఆలోచనగా కనిపిస్తోందని విమర్శించారు. కేటీఆర్ చేసిన ఆరోపణలకు ఆధారాలు ఉంటే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
Sridhar Babu
KTR
Telangana
BRS
Land Allocation
Industrial Development
Investments

More Telugu News