DK Shivakumar: కర్ణాటక సీఎం మార్పు అంశం... కీలక వ్యాఖ్యలు చేసిన డీకే శివకుమార్

DK Shivakumar comments on Karnataka Chief Minister Change
  • ఐదేళ్లు సిద్ధరామయ్యనే ముఖ్యమంత్రిగా కొనసాగుతారన్న డీకే శివకుమార్
  • గ్రూపు రాజకీయాలు చేయడం తన రక్తంలో లేదని ఉద్ఘాటన
  • కాంగ్రెస్ పార్టీ 140 మంది ఎమ్మెల్యేలు నా వారే అంటూ వ్యాఖ్యలు 
కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు ఊహాగానాలకు ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తెరదించారు. ఐదేళ్ల పాటు సిద్ధరామయ్యనే ముఖ్యమంత్రిగా కొనసాగుతారని, ఆయనకు తాము పూర్తిగా సహకరిస్తామని స్పష్టం చేశారు. గ్రూపు రాజకీయాలు చేయడం తన రక్తంలోనే లేదని ఆయన అన్నారు. ఎవరో కొంతమంది మాత్రమే కాదని, కాంగ్రెస్ పార్టీకి చెందిన 140 మంది ఎమ్మెల్యేలు కూడా తనవారే అని ఆయన వ్యాఖ్యానించారు.

త్వరలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని సిద్ధరామయ్య చెప్పారని, ఈ నేపథ్యంలో పలువురు ఎమ్మెల్యేలు ఢిల్లీలో అధిష్ఠానం పెద్దలను కలిశారని ఆయన అన్నారు. వారు మంత్రి పదవుల కోసమే కలిసి ఉంటారని, అది సహజమేనని, ఇందులో తనకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు. మంత్రి పదవి కోసం వారు ముఖ్యమంత్రిని కూడా కలిశారని, అందులో తప్పేముందని ప్రశ్నించారు. ఎమ్మెల్యేలు తమంతట తామే వెళ్లారని స్పష్టం చేశారు.

కాంగ్రెస్ పార్టీకి చెందిన 140 మంది ఎమ్మెల్యేలు మంత్రి పదవులకు అర్హులేనని, వారికి ఏ బాధ్యత అయినా అప్పగించవచ్చని శివకుమార్ అన్నారు. ఐదేళ్లు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని సిద్ధరామయ్య స్పష్టం చేశారని, ఆయనకు తాను శుభాకాంక్షలు చెబుతున్నానని అన్నారు. మేమంతా కలిసి పనిచేస్తామని అన్నారు.

కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు అంశం తరచూ చర్చనీయాంశంగా మారుతోంది. డీకే శివకుమార్ వర్గానికి చెందిన పలువురు ఎమ్మెల్యేలు ఢిల్లీ బాట పట్టడంతో తాజాగా మరోసారి కర్ణాటక రాజకీయాలు వేడెక్కాయి. సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా రెండున్నర సంవత్సరాలు పూర్తి చేసుకోవడంతో డీకే శివకుమార్‌కు అవకాశం ఇవ్వాలని ఆయన వర్గం కోరుకుంటోంది. ఈ మేరకు అధిష్ఠానంపై ఒత్తిడి తేవడానికి ఎమ్మెల్యేలు ఢిల్లీకి వెళ్లారు. ఈరోజు డీకే శివకుమార్ వర్గం ఎమ్మెల్యేల బృందం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సమావేశం కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

సీఎం మార్పు ప్రచారాన్ని కొట్టిపారేసిన సుర్జేవాలా

నాయకత్వ మార్పుపై జరుగుతున్న ప్రచారాన్ని ఏఐసీసీ జనరల్ సెక్రటరీ రణ్‌‍దీప్ సుర్జేవాలా తోసిపుచ్చారు. కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వానికి బీజేపీ చేస్తున్న దుష్ప్రచారమని ఆయన ఆరోపించారు. సిద్ధరామయ్య, శివకుమార్‌లతో తాను చర్చలు జరిపానని కూడా ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి మార్పు అంటూ పార్టీకి చెందిన వారెవరూ బహిరంగ ప్రకటనలు చేయవద్దని ఆయన హెచ్చరించారు.

స్పందించిన సిద్ధరామయ్య

నాయకత్వ మార్పుపై పార్టీ అధిష్ఠానం మాత్రమే నిర్ణయం తీసుకుంటుందని సిద్ధరామయ్య స్పష్టం చేశారు. ఖర్గే, గాంధీల నిర్ణయమే శిరోధార్యమని అన్నారు. అధిష్ఠానం మాటకు తాను, డీకే శివకుమార్ కట్టుబడి ఉంటామని తెలిపారు. మరోవైపు, ఈరోజు ఉదయం సిద్ధరామయ్య పార్టీ అధినేత ఖర్గేకు ఫోన్ చేశారు. నిత్యం ముఖ్యమంత్రి మార్పు అంశంపై మాట్లాడుతుండటం రాష్ట్రంలో పార్టీ ప్రతిష్ఠను దెబ్బతీస్తోందని ఆయన వివరించారు. ఈ అంశానికి తెరదించుతామని ఖర్గే ఆయనకు హామీ ఇచ్చారు.
DK Shivakumar
Karnataka politics
Siddaramaiah
Karnataka CM
Congress party

More Telugu News