దుబాయ్ ఎయిర్ షోలో కుప్పకూలిన 'తేజస్' యుద్ధ విమానం... వీడియో ఇదిగో!
- దుబాయ్‌లో విన్యాసాలు చేస్తుండగా నేలకూలిన తేజస్ యుద్ధ విమానం
- పైలట్ పరిస్థితిపై ఇంకా వెలువడని అధికారిక ప్రకటన
- తేజస్ విమానానికి ఇది రెండో ప్రమాదం
స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2:10 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఎయిర్ షో చూసేందుకు వచ్చిన ప్రేక్షకులు చూస్తుండగానే విమానం అదుపుతప్పి వేగంగా కిందకి దూసుకువచ్చి కుప్పకూలింది. ఈ ఘటనపై భారత వాయుసేన (IAF) నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
తేజస్ యుద్ధ విమానం ప్రమాదానికి గురవడం ఇది రెండోసారి. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) దేశీయంగా అభివృద్ధి చేసిన ఈ విమానం తొలిసారిగా 2024 మార్చిలో రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో కూలిపోయింది. అయితే, ఆ ప్రమాదంలో పైలట్ సురక్షితంగా ఎజెక్ట్ అయ్యారు. తేజస్ చరిత్రలో అదే మొదటి ప్రమాదం.
తేజస్ 4.5వ తరం మల్టీ-రోల్ ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్. ఇందులో పైలట్ సురక్షితంగా బయటపడేందుకు 'జీరో-జీరో' ఎజెక్షన్ సీటు వంటి అత్యాధునిక వ్యవస్థ ఉంది. ప్రపంచంలోని అతిపెద్ద ఏవియేషన్ ప్రదర్శనలలో ఒకటైన దుబాయ్ ఎయిర్ షోలో ఈ ప్రమాదం జరగడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.