Donald Trump: జీ20 సమ్మిట్‌పై మాటల యుద్ధం.. దక్షిణాఫ్రికా ప్రకటనను ఖండించిన అమెరికా

Donald Trump G20 Summit Dispute Erupts with South Africa
  • జోహన్నెస్‌బర్గ్ జీ20 సదస్సును బహిష్కరించిన అమెరికా
  • సమ్మిట్‌లో అమెరికా పాల్గొంటోందన్న దక్షిణాఫ్రికా అధ్యక్షుడు
  • ఈ వార్తలను తీవ్రంగా ఖండించిన ట్రంప్ ప్రభుత్వం
దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లో జరగనున్న జీ20 సదస్సులో తాము పాల్గొంటున్నామంటూ వస్తున్న వార్తలను అమెరికా తీవ్రంగా ఖండించింది. ఈ సదస్సును బహిష్కరించాలన్న నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదని డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం స్పష్టం చేసింది. సదస్సులో పాల్గొనేందుకు అమెరికా అంగీకరించిందని దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా చేసిన ప్రకటన ఇరు దేశాల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది.

గురువారం అధ్యక్షుడు రామఫోసా మాట్లాడుతూ.. జీ20 సదస్సులో పాల్గొనే విషయంలో ట్రంప్ ప్రభుత్వం మనసు మార్చుకుందని, ఇది చాలా సానుకూల పరిణామమని వ్యాఖ్యానించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన అమెరికా ఇక్కడ ఉండటం అవసరమని ఆయన అన్నారు.

అయితే, ఈ వ్యాఖ్యలను వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ తీవ్రంగా ఖండించారు. "దక్షిణాఫ్రికాలో జరగనున్న జీ20 అధికారిక చర్చల్లో అమెరికా పాల్గొనడం లేదు" అని ఆమె స్పష్టం చేశారు. "దక్షిణాఫ్రికా అధ్యక్షుడు అమెరికా గురించి, మా అధ్యక్షుడి గురించి నోరు పారేసుకున్నట్లు గమనించాను. అలాంటి భాషను అధ్యక్షుడు గానీ, ఆయన బృందం గానీ సహించదు" అని ఆమె ఘాటుగా వ్యాఖ్యానించారు.

వచ్చే ఏడాది జీ20 సదస్సుకు అమెరికా ఆతిథ్యం ఇవ్వనున్నందున, కేవలం బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి మాత్రమే తమ రాయబారి హాజరవుతారని వైట్‌హౌస్ వివరించింది. దక్షిణాఫ్రికాలోని శ్వేతజాతి మైనారిటీ రైతులపై అక్కడి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ట్రంప్ ప్రభుత్వం గత కొంతకాలంగా తీవ్ర విమర్శలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే సదస్సు బహిష్కరణ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వపరంగా బహిష్కరణ ఉన్నప్పటికీ, జోహన్నెస్‌బర్గ్‌లో జరిగిన బిజినెస్ 20 (బీ20) కార్యక్రమంలో అమెరికాకు చెందిన పలు వాణిజ్య సంస్థలు పాల్గొనడం గమనార్హం. 
Donald Trump
G20 Summit
South Africa
Cyril Ramaphosa
America
US boycott
White House
Caroline Leavitt
Johannesburg
B20

More Telugu News