Shubman Gill: భారత్‌కు ఎదురుదెబ్బ.. గిల్ ఔట్.. పగ్గాలు పంత్ చేతికి

Shubman Gill Ruled Out Rishabh Pant Captain for Second Test
  • దక్షిణాఫ్రికాతో రెండో టెస్టుకు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ దూరం
  • మెడ నొప్పితో బాధపడుతున్న గిల్‌కు విశ్రాంతినిచ్చిన బీసీసీఐ
  • గువాహటి టెస్టులో జట్టుకు వికెట్ కీపర్ రిషభ్ పంత్ కెప్టెన్సీ
  • గిల్ స్థానంలో సాయి సుదర్శన్‌కు అవకాశం?  
  • ఇప్పటికే సిరీస్‌లో 1-0తో వెనుకబడిన భారత్
దక్షిణాఫ్రికాతో జరగనున్న రెండో టెస్టుకు ముందు టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మెడ నొప్పి కారణంగా ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. దీంతో శుక్రవారం అతడిని జట్టు నుంచి విడుదల చేస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. గిల్ స్థానంలో వైస్ కెప్టెన్ రిషభ్ పంత్ జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. రేప‌టి నుంచి గువాహటి వేదికగా ఈ టెస్టు ప్రారంభం కానుంది.

కొంతకాలంగా మెడ నొప్పితో ఇబ్బంది పడుతున్న గిల్, మెరుగైన వైద్యం కోసం ఇవాళ‌ ఉదయం ముంబైకి వెళ్లాడు. అక్కడ స్పెషలిస్ట్ ని సంప్రదించి, గాయంపై పూర్తిస్థాయిలో చికిత్స తీసుకోనున్నాడు. కోల్‌కతాలో జరిగిన తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో కేవలం మూడు బంతులు ఆడిన తర్వాత గిల్ రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్‌లో భారత్ 30 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.

గిల్ గైర్హాజరీతో భారత జట్టు కూర్పుపై ఆసక్తి నెలకొంది. ఇప్పటికే తుది జట్టులో ఎక్కువమంది ఎడమచేతి వాటం బ్యాటర్లు ఉండటం జట్టుకు సమస్యగా మారింది. గిల్ స్థానంలో జట్టులోకి వచ్చే రేసులో ఉన్న సాయి సుదర్శన్, దేవదత్ పడిక్కల్ కూడా ఎడమచేతి వాటం ఆటగాళ్లే. ఈ నేపథ్యంలో సాయి సుదర్శన్‌కు ఓపెనర్‌గా అవకాశం దక్కవచ్చని తెలుస్తోంది.

గిల్ ఆరోగ్యంపై రిస్క్ తీసుకోవాలనుకోవడం లేదని, అతని దీర్ఘకాలిక ఫిట్‌నెస్‌కే ప్రాధాన్యత ఇస్తామని బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ స్పష్టం చేశారు. "గిల్ గాయం నుంచి కోలుకుంటున్నాడు. కానీ, మళ్లీ నొప్పి తిరగబెట్టదనే గ్యారెంటీ ఉంటేనే ఆడిస్తాం. మాకు బలమైన బెంచ్ ఉంది. గిల్ స్థానంలో వచ్చే ఆటగాడు కూడా రాణిస్తాడనే నమ్మకం ఉంది" అని ఆయన తెలిపారు. ఇప్పటికే సిరీస్‌లో 1-0తో వెనుకబడిన భారత్‌కు, కెప్టెన్ దూరం కావడం మరో సవాల్‌గా మారింది.


Shubman Gill
Rishabh Pant
India vs South Africa
India Cricket
Cricket Test Match
BCCI
Sai Sudharsan
Devdutt Padikkal
Sitanshu Kotak
Guwahati Test

More Telugu News