Yuvaraju: బైక్ ఇవ్వలేదని పోలీస్ స్టేషన్ నుంచి జీపు ఎత్తుకెళ్లిన మందుబాబు!

Drunk Man Steals Police Jeep in Andhra Pradesh After Bike Seized
  • కర్నూలు జిల్లా ఆలూరులో విచిత్ర ఘటన
  • డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడిన యువకుడు
  • పోలీస్ జీపును ఇంటికి తీసుకెళ్లిన వైనం
కర్నూలు జిల్లా ఆలూరు పోలీస్ స్టేషన్‌లో ఓ విచిత్ర ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మద్యం మత్తులో ఉన్న ఓ యువకుడు ఏకంగా పోలీసుల జీపునే దర్జాగా తన ఇంటికి తీసుకెళ్లాడు. 

వివరాల్లోకి వెళితే, ఆలూరుకు సమీపంలోని పెద్దహోతూరు గ్రామానికి చెందిన యువరాజు అనే వ్యక్తిని బుధవారం రాత్రి పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ కేసులో పట్టుకున్నారు. అతడి బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం ఉదయం పోలీస్ స్టేషన్‌కు వచ్చిన యువరాజు, తన బైక్‌ను తిరిగి ఇవ్వాలని పోలీసులను కోరాడు. వారు నిరాకరించడంతో, "నా బైక్ ఇవ్వకపోతే మీ జీపు తీసుకెళ్లిపోతా" అని హెచ్చరించాడు.

అతడు మద్యం మత్తులో మాట్లాడుతున్నాడని భావించిన పోలీసులు ఆ మాటలను తేలిగ్గా తీసుకున్నారు. అయితే, చెప్పినట్టుగానే యువరాజు అక్కడే ఉన్న సీఐ జీపును తీసుకుని తన ఊరికి వెళ్లిపోయాడు. ఇంటికి వెళ్లిన తర్వాత తీవ్రమైన మత్తులో ఉండటంతో మాట్లాడలేని స్థితిలో పడిపోయాడు. కాసేపటి తర్వాత ఇది గమనించిన అతడి సోదరుడు అంజి, వెంటనే జీపును తిరిగి పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చాడు. ఈ విషయంపై స్థానికంగా ప్రచారం జరగడంతో సీఐ రవిశంకర్‌ను వివరణ కోరగా, అలాంటి సంఘటన ఏదీ జరగలేదని ఆయన కొట్టిపారేయడం గమనార్హం.
Yuvaraju
Aluru Police Station
Kurnool
Andhra Pradesh Police
Drunk and Drive
CI Ravi Shankar
Bike Seizure
Police Jeep Theft

More Telugu News