Smriti Mandhana: నిశ్చితార్థం చేసుకున్న స్మృతి మంధాన... శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ

Smriti Mandhana Engaged Congratulated by PM Modi
  • ప్రియుడు పలాశ్‌ ముచ్చల్‌తో ఎంగేజ్‌మెంట్‌ను ధ్రువీకరించిన స్మృతి
  • సహచర క్రీడాకారిణులతో కలిసి ఇన్‌స్టా రీల్‌లో ఎంగేజ్‌మెంట్ రింగ్‌తో స‌ర్‌ప్రైజ్‌
  • కొత్త జంటకు ప్రధాని నరేంద్ర మోదీ నుంచి ప్రత్యేక శుభాకాంక్షలు
  • ఈ నెల 23నే వివాహం జరగనుందంటూ ప్రచారం
టీమిండియా స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన తన అభిమానులకు తీపి కబురు చెప్పింది. తన ప్రియుడు, సంగీత దర్శకుడు పలాశ్ ముచ్చల్‌తో నిశ్చితార్థం జరిగినట్లు ఆమె ధ్రువీకరించింది. సహచర క్రీడాకారిణులు రిచా ఘోష్, జెమీమా రోడ్రిగ్స్, రాధా యాదవ్, అరుంధతి రెడ్డి, శ్రేయాంక పాటిల్‌లతో కలిసి చేసిన ఓ ఇన్‌స్టా రీల్‌లో తన వేలికి ఉన్న నిశ్చితార్థం ఉంగరాన్ని చూపిస్తూ ఈ విషయాన్ని పరోక్షంగా వెల్లడించింది.

స్మృతి ఈ విషయాన్ని ప్రకటించిన కొద్దిసేపటికే ప్రధాని నరేంద్ర మోదీ నుంచి ప్రత్యేక శుభాకాంక్షలు అందాయి. కాబోయే జంట స్మృతి-పలాశ్‌కు అభినందనలు తెలుపుతూ ప్రధాని కార్యాలయం (పీఎంఓ) ఓ సందేశం పంపింది. ఈ సందేశం ప్రకారం ఈ నెల 23న వీరి వివాహం జరగనున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ తేదీపై మంధాన గానీ, పలాశ్ గానీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.

గత కొంతకాలంగా స్మృతి, పలాశ్ ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. పలుమార్లు వీరిద్దరూ కలిసి బయట కనిపించారు. మంధాన ఆడే ముఖ్యమైన మ్యాచ్‌లకు పలాశ్ హాజరై ఆమెను ప్రోత్సహిస్తూ వచ్చారు. బాలీవుడ్‌లో సంగీత దర్శకుడిగా పలాశ్ పలు సినిమాలకు పనిచేశారు.

ఇటీవల ముగిసిన మహిళల వన్డే ప్రపంచకప్‌లో భారత్ విజేతగా నిలవడంలో మంధాన కీలక పాత్ర పోషించింది. టోర్నీలో 434 పరుగులు చేసి రికార్డు సృష్టించింది. అంతకుముందు మహిళల ప్రీమియర్ లీగ్‌లో కెప్టెన్‌గా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు తొలి టైటిల్ అందించిన ఘనత కూడా ఆమెదే. మంధాన నిశ్చితార్థం వార్త తెలియగానే సహచర క్రికెటర్లు, ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
Smriti Mandhana
Palash Muchhal
Indian cricketer
engagement
Narendra Modi
womens cricket
cricket news
Richa Ghosh
Royal Challengers Bangalore
Womens Premier League

More Telugu News