Jaish-e-Mohammed: ఎర్రకోట పేలుళ్ల కుట్ర.. 'బిర్యానీ' కోడ్‌వర్డ్‌తో బాంబుల తయారీ

Red Fort Blast Biryani Code Word Used for Bomb Making
  • ఢిల్లీ పేలుళ్ల వెనుక పాకిస్థాన్ జైషే ఉగ్రవాద సంస్థ హ్యాండ్లర్
  • డాక్టర్లకు బాంబుల తయారీ వీడియోలు పంపిన 'హంజుల్లా'
  • 'బిర్యానీ' అనే కోడ్‌వర్డ్‌తో పేలుడు పదార్థాల రవాణా
  • టెర్రర్ ఫండింగ్ కేసులో అల్-ఫలా యూనివర్సిటీ వ్యవస్థాపకుడి అరెస్ట్
ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో 15 మంది మరణానికి కారణమైన పేలుళ్ల కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కుట్రలో భాగమైన డాక్టర్ల ముఠాకు పాకిస్థాన్‌కు చెందిన జైషే మహ్మద్ హ్యాండ్లర్ 'హంజుల్లా' బాంబుల తయారీపై ఆన్‌లైన్‌లో శిక్షణ ఇచ్చినట్లు దర్యాప్తు వర్గాలు వెల్లడించాయి. నిందితుల్లో ఒకరైన డాక్టర్ ముజమిల్ షకీల్‌కు 'హంజుల్లా' బాంబుల తయారీ వీడియోలు పంపినట్లు గుర్తించారు. 'హంజుల్లా' అనేది మారుపేరుగా భావిస్తున్నారు.

జమ్మూకశ్మీర్‌లోని షోపియాన్‌కు చెందిన మతగురువు మౌల్వీ ఇర్ఫాన్ అహ్మద్ ద్వారా హంజుల్లా.. డాక్టర్ షకీల్‌ను సంప్రదించాడు. మొదట షకీల్‌ను ఉగ్రవాదం వైపు ప్రేరేపించిన మౌల్వీ, ఆ తర్వాత ఫరీదాబాద్‌లోని అల్-ఫలా యూనివర్సిటీలో పనిచేస్తున్న ఇతర డాక్టర్లను కూడా ఈ ముఠాలో చేర్చుకునేలా చేశాడు. పేలుడు పదార్థాలను రవాణా చేయడంలో, ఆత్మాహుతి దాడికి ఉపయోగించిన హ్యుందాయ్ ఐ20 కారును ఉగ్రవాది ఉమర్ మహ్మద్‌కు అప్పగించడంలో షకీల్ కీలక పాత్ర పోషించినట్లు ఆరోపణలు ఉన్నాయి.

దర్యాప్తు సంస్థల దృష్టి మరల్చేందుకు ఈ ముఠా టెలిగ్రామ్ యాప్‌లో ప్రత్యేక కోడ్‌వర్డులు వాడింది. పేలుడు పదార్థాలను 'బిర్యానీ' అని, దాడిని 'దావత్' అని పిలుచుకుంటూ తమ ప్రణాళికలు రచించారు. ఢిల్లీ, గురుగ్రామ్, ఫరీదాబాద్‌లలోని కీలక ప్రాంతాల్లో దాడుల కోసం 200 శక్తిమంతమైన బాంబులను సిద్ధం చేసినట్లు సమాచారం.

ఈ ఉగ్రకుట్రకు ఫరీదాబాద్‌లోని అల్-ఫలా యూనివర్సిటీ కేంద్రంగా మారినట్లు దర్యాప్తులో తేలింది. టెర్రర్ ఫండింగ్, మనీలాండరింగ్ ఆరోపణలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు యూనివర్సిటీ వ్యవస్థాపకుడు జావేద్ అహ్మద్ సిద్ధిఖీని అరెస్ట్ చేశారు. యూనివర్సిటీకి చెందిన 25 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి రూ.48 లక్షల నగదు, కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ యూనివర్సిటీ కార్యకలాపాలపై లోతైన విచారణ కోసం ఫరీదాబాద్ పోలీసులు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేశారు.
Jaish-e-Mohammed
Red Fort Blast
Delhi Red Fort
Hanjulla
Dr Muzamil Shakeel
Al-Falah University
Terror Plot
Faridabad
Code Word Biryani
ED Investigation

More Telugu News