Sajeeb Wazed: మా అమ్మను టచ్ కూడా చేయలేరు.. బంగ్లా తాత్కాలిక ప్రభుత్వంపై హసీనా కుమారుడి ఫైర్

Sajeeb Wazed Fires on Bangladesh Interim Government Over Sheikh Hasina Verdict
  • తన తల్లిని యూనస్ ఏమీ చేయలేరన్న సజీబ్ వాజెద్
  • హసీనాకు విధించిన మరణశిక్ష ఒక ప్రహసనమని విమర్శ
  • బంగ్లాదేశ్‌ను యూనస్ విఫల రాజ్యంగా మారుస్తున్నారని ఆరోపణ
  • విచారణ ప్రక్రియ పూర్తిగా చట్టవిరుద్ధంగా జరిగిందని వ్యాఖ్య 
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు మరణశిక్ష విధించిన నేపథ్యంలో ఆమె కుమారుడు సజీబ్ వాజెద్ తీవ్రంగా స్పందించారు. దేశ తాత్కాలిక అధినేత మహమ్మద్ యూనస్ తన తల్లిని ఏమీ చేయలేరని, ఆమెను కనీసం తాకలేరని ఆయన ధీమా వ్యక్తం చేశారు. హసీనాకు విధించిన మరణశిక్ష తీర్పు ఒక ప్రహసనమని, దాన్ని అమలు చేసే అవకాశం లేదని ఆయన కొట్టిపారేశారు.

గురువారం ఆయన ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ.. "యూనస్ నా తల్లిని ఏమీ చేయలేరు. చట్టబద్ధమైన పాలన వచ్చినప్పుడు ఈ మొత్తం ప్రక్రియ రద్దయిపోతుంది. ప్రస్తుతం జరుగుతున్నదంతా చట్టవిరుద్ధం, రాజ్యాంగ విరుద్ధం" అని అన్నారు. కష్టకాలంలో తన తల్లి ప్రాణాలను కాపాడుతున్నందుకు భారత ప్రభుత్వానికి వాజెద్ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.

విచారణ ప్రక్రియ జరిగిన తీరును వాజెద్ తీవ్రంగా తప్పుపట్టారు. "ప్రభుత్వం చట్టవిరుద్ధంగా ఉంది. పార్లమెంటు లేకుండానే చట్టాలను సవరించి ఈ విచారణను వేగవంతం చేశారు. ట్రైబ్యునల్‌లోని 17 మంది న్యాయమూర్తులను తొలగించి, తన తల్లిపై ద్వేషం ఉన్న వ్యక్తిని న్యాయమూర్తిగా నియమించారు. ఇది స్పష్టంగా పక్షపాతంతో కూడుకున్నది" అని ఆరోపించారు. తన తల్లికి సొంత లాయర్‌ను నియమించుకునే అవకాశం కూడా ఇవ్వలేదని, ప్రభుత్వమే లాయర్లను నియమించిందని ఆవేదన వ్యక్తం చేశారు.

మహమ్మద్ యూనస్‌కు ఇచ్చిన నోబెల్ శాంతి బహుమతిని వెనక్కి తీసుకోవాలన్న డిమాండ్‌పైనా ఆయన స్పందించారు. "ఒకరికి అవార్డు ఇచ్చాక నోబెల్ కమిటీ ఇక దానిని వెనక్కి తీసుకోదు. అయితే, మయన్మార్‌లో ఆంగ్ సాన్ సూకీ కూడా నోబెల్ గ్రహీతే, కానీ ఆమె రోహింగ్యాల హత్యలకు కారణమయ్యారు. ఇప్పుడు యూనస్ బంగ్లాదేశ్‌ను విఫల రాజ్యంగా, ఉగ్రవాద దేశంగా మారుస్తున్నారు" అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

2024లో విద్యార్థులు చేపట్టిన భారీ ఉద్యమంపై హింసాత్మక అణచివేతకు ఆదేశాలిచ్చారన్న ఆరోపణలతో షేక్ హసీనాపై బంగ్లాదేశ్ ట్రైబ్యునల్ మరణశిక్ష విధించిన విషయం తెలిసిందే. ఈ ఉద్యమం కారణంగానే ఆమె అధికారం కోల్పోయారు. ప్రస్తుతం 78 ఏళ్ల హసీనా భారత్‌లో ఆశ్రయం పొందుతున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో బంగ్లాదేశ్‌లో జాతీయ ఎన్నికలు జరగనున్నాయి.
Sajeeb Wazed
Sheikh Hasina
Bangladesh
Mohammad Yunus
Bangladesh Election 2025
Nobel Peace Prize
Rohingya
India
Political News
Bangladesh Politics

More Telugu News