Balakrishna: వేదిక‌పై బాలయ్య స్టైల్.. షాకైన శ్రీలీల.. ఇదిగో వీడియో!

Balakrishna Swag Steals Show at IFFI Goa with Sreeleela
  • గోవాలో జరుగుతున్న 56వ ఇఫీ వేడుకల్లో బాలకృష్ణకు అరుదైన గౌరవం
  • నటుడిగా 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఘనంగా సన్మానం
  • వేదిక‌పై కళ్లజోడు గాల్లోకి విసిరి తన మార్క్ స్టైల్‌తో ఆకట్టుకున్న బాలయ్య
  • సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన బాలకృష్ణ స్వాగ్ వీడియో
నందమూరి బాలకృష్ణకు అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం లభించింది. గోవాలో ప్రతిష్ఠాత్మకంగా జరుగుతున్న 56వ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో (ఇఫీ) ఆయనను ఘనంగా సత్కరించారు. నటుడిగా ఐదు దశాబ్దాల సుదీర్ఘ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ ప్రత్యేక సన్మానం చేశారు. గోవా గవర్నర్ అశోక్ గజపతి రాజు, కేంద్ర సమాచార, ప్రసార శాఖ సహాయమంత్రి ఎల్. మురుగన్, గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ కలిసి బాలకృష్ణకు శాలువా కప్పి అభినందించారు.

ఈ సత్కార కార్యక్రమం తర్వాత బాలయ్య తనదైన మార్క్ చూపించారు. వేదికపై నటి శ్రీలీలతో కలిసి నిల్చున్నప్పుడు, ఆయన తన కళ్లజోడును అకస్మాత్తుగా గాల్లోకి విసిరి అంతే స్టైల్‌గా పట్టుకున్నారు. ఈ అనూహ్యమైన చర్యకు అక్కడున్న ప్రేక్షకులు, శ్రీలీల ఆశ్చర్యపోయారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్‌గా మారింది. బాలయ్య స్వాగ్‌కు ఫిదా అవుతున్నామంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.

ఇలాంటి స్టైలిష్ మేనరిజమ్స్ బాలకృష్ణకు కొత్తేమీ కాదు. గతంలో కూడా పలు ఈవెంట్లలో మైక్‌ను, ఫోన్‌ను గాల్లోకి ఎగరవేసి తన మాస్ యాటిట్యూడ్‌ను ప్రదర్శించారు. ఆరు పదుల వయసులోనూ అదే ఎనర్జీతో కుర్ర హీరోలతో పోటీపడుతూ సినిమాలు చేస్తుండటం ఆయనకే చెల్లింది.

నిన్న‌ ప్రారంభమైన ఈ ఇఫీ వేడుకలు ఈ నెల 28వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ప్రారంభోత్సవానికి అనుపమ్ ఖేర్, దిల్ రాజు వంటి ప్రముఖులు హాజరయ్యారు. ముగింపు వేడుకలో సూపర్‌స్టార్ రజనీకాంత్‌ను కూడా సత్కరించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
Balakrishna
Nandamuri Balakrishna
Sreeleela
IFFI Goa
International Film Festival of India
Ashok Gajapathi Raju
L Murugan
Pramod Sawant
Telugu cinema
Indian cinema

More Telugu News